Corona Virus: తెలంగాణలో తొలి టీకా గాంధీ ఆసుపత్రి పారిశుద్ధ్యకార్మికుడికి!

Sanitation worker to take first vaccine in Telangana
  • గాంధీ ఆసుపత్రిలో 10 నెలలుగా సేవలు అందిస్తున్న కార్మికుడు
  • అతడికి ఇచ్చిన తర్వాతే రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం
  • తొలి వారం ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కేంద్రాల్లోనే..
  • ప్రైవేటు కేంద్రాల్లో ఇవ్వాలన్న నిర్ణయం ప్రస్తుతానికి ఉపసంహరణ
దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుండగా, తెలంగాణలో తొలి టీకాను ఓ పారిశుద్ధ్య కార్మికుడికి వేయనున్నారు. కరోనా నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో గత 10 నెలలుగా సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికుడికి తొలి టీకా ఇస్తారు.

అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ ప్రారంభం అవుతుంది. అలాగే, తొలి రోజు టీకా వేసే 139 కేంద్రాలూ ప్రభుత్వ ఆధ్వర్యంలోనివే. నిజానికి తొలి రోజు 99 ప్రభుత్వ కేంద్రాలు, 40 ప్రైవేటు ఆసుపత్రులలో టీకా కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే, ప్రైవేటు ఆసుపత్రులలో వేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రస్తుతానికి ఉపసంహరించుకుంది.

ప్రభుత్వ ఆసుపత్రులలో టీకాలు వేస్తే, సమస్యలపై అవగాహన వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి తొలి వారంలో ప్రభుత్వ ఆసుపత్రులలోనే టీకా కార్యక్రమాన్ని నిర్వహించి, ఆ తర్వాతి నుంచి ప్రైవేటు ఆసుపత్రులలోనూ టీకా వేయనున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు ఈ విషయాన్ని తెలిపారు.

నేటి సాయంత్రానికి యాప్ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. టీకా పంపిణీ తర్వాత కూడా సమస్యలు ఎదురైతే ఆఫ్‌లైన్‌లోనే సమాచారాన్ని పొందుపరచాలని సూచించారు. లబ్ధిదారులకు ఏవైనా సందేహాలు ఉంటే 104 నంబరుకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని కోరారు.
Corona Virus
Vaccination
Telangana
Gandhi Hospital
Sanitation worker

More Telugu News