చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన మహిళ.. రూ. 2 లక్షలకు కువైట్‌ లోని వ్యక్తికి అమ్మేసిన వైద్యుడు!

14-01-2021 Thu 08:05
  • క్లినిక్‌కు వచ్చిన మహిళకు ఉద్యోగం పేరుతో గాలం
  • తిండి పెట్టకుండా హింసించిన కువైట్ యజమాని
  • రూ. 2 లక్షలకు కొనుగోలు చేశానన్న యజమాని
Doctor sold woman to Kuwait for 2 lakh rupees

చికిత్స కోసం తన వద్దకు వచ్చిన మహిళా రోగిని ఉద్యోగం పేరుతో నమ్మించి రెండు లక్షల రూపాయలకు అమ్మేశాడో వైద్యుడు. హైదరాబాద్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. టోలిచౌకి సమతా కాలనీకి చెందిన తాహేరాబేగం (40) అనారోగ్యంతో బాధపడుతూ గోల్కొండ కోటరా హౌస్ వద్ద ఉన్న షిఫా క్లినిక్‌కు వెళ్లింది.

వైద్యుడు షబ్బీర్ హుస్సేన్ ఆమెతో పరిచయం పెంచుకుని కువైట్‌లో ఓ ఇంట్లో పనిమనిషిగా చేరితే నెలకు రూ. 25 వేలు సంపాదించవచ్చని ఆశ చూపాడు. కుమార్తెకు పెళ్లి చేసి అప్పులపాలైన తాహెరాబేగం అందుకు సరేనంది. గతేడాది ఫిబ్రవరి 3న తాహెరాబేగం కువైట్ వెళ్లింది.

డాక్టర్ షబ్బీర్ హుస్సేన్ తమ్ముడు అక్కడామెను కలిసి అల్ షమారీ అనే వ్యక్తి వద్ద ఇంట్లో పనికి కుదిర్చాడు. ఆ తర్వాతి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. తినడానికి తిండి కూడా సరిగా పెట్టకపోవడంతో తనను తిరిగి ఇండియాకు పంపాలని వేడుకుంది. దీంతో అసలు విషయం బయటపడింది.

 తాను రెండు లక్షల రూపాయలు ఇచ్చి నిన్ను కొనుగోలు చేసుకున్నానని యజమాని చెప్పడంతో ఆమె విస్తుపోయింది. దీంతో విషయాన్ని ఆమె ఇండియాలో ఉన్న కుమార్తెకు చెప్పింది. ఆమె ఎంబీటీ నేత అమ్జాదుల్లాఖాన్ దృష్టికి తీసుకెళ్లింది. ఆయన ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.