హనుమ విహారి నేరస్థుడంటూ కేంద్రమంత్రి ఆగ్రహం.. తన పేరుతోనే కౌంటర్ ఇచ్చిన తెలుగు క్రికెటర్!

14-01-2021 Thu 07:47
  • 109 బంతుల్లో ఏడు పరుగులా?
  • క్రికెట్‌ను చంపేశాడు
  • చారిత్రక గెలుపును అడ్డుకున్నాడు
  • నెటిజన్ల మనసులు గెలుచుకున్న విహారి రిప్లై
cricketer Hanuma Viharis jibe at Babul Supriyo wins internet

తెలుగు క్రికెటర్ హనుమ విహారిపై కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో విహారి అద్భుత పోరాట పటిమ కనబర్చి మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించాడు. అతడి ఆటకు తాజా, మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. టీమిండియాకు మరో ‘వాల్’ (ద్రవిడ్‌) దొరికాడంటూ కొనియాడారు.

కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో మాత్రం ఇందుకు విరుద్ధంగా స్పందించారు. 109 బంతులు ఆడి ఏడు పరుగులు చేయడం నేరమని, భారత జట్టు చారిత్రక గెలుపును బిహారి చంపేశాడంటూ.. విహారి పేరు బదులు బిహారి అని పేర్కొంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్రికెట్‌ను బిహారి చంపేశాడని వ్యాఖ్యానించారు. గెలుపు అవకాశాలను నిలబెట్టలేకపోయిన అతడు ఓ నేరస్థుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రికెట్ గురించి తనకు ఏమీ తెలియదంటూనే మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

కేంద్రమంత్రి ట్వీట్‌పై విహారి స్పందన అభిమానుల ప్రశంసలు అందుకుంది. మంత్రి తనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఏమాత్రం మాట్లాడని విహారి.. తన పేరు బిహారి కాదని, హనుమ విహారి అని రిప్లై ఇచ్చాడు. అతడి సమాధానం నెటిజన్ల మనసును దోచుకుంది.