Donald Trump: అభిశంసనకు గురైన ట్రంప్.. రెండోసారి అభిశంసనకు గురైన తొలి అధ్యక్షుడిగా రికార్డు
- మైక్ పెన్స్ ప్రతిఘటించినప్పటికీ ఫలితం శూన్యం
- అభిశంసన తీర్మానానికి అత్యధికమంది సభ్యుల ఆమోదం
- 20న అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న బైడెన్
- ఆ తర్వాత ట్రంప్‌పై విచారణ
మొత్తానికి అనుకున్నదే అయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరి రోజులు అత్యంత అవమానకరంగా ముగిశాయి. మరోవారం రోజుల్లో అధ్యక్షపీఠం నుంచి దిగిపోనున్న వేళ.. అభిశంసనకు గురై అవమానాన్ని ఎదుర్కొన్నారు. రెండోసారి అభిశంసనకు గురైన తొలి అధ్యక్షుడిగా అమెరికా చరిత్రలో నిలిచిపోయారు.
ట్రంప్ ఇంతటి అవమానాన్ని ఎదుర్కోవడానికి కారణం కేపిటల్ భవనంపై ఆయన మద్దతుదారుల దాడి ఘటనే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్ గెలుపును నిర్ధారించేందుకు సమావేశమైన కేపిటల్ హిల్ భవనాన్ని చుట్టుముట్టిన ట్రంప్ మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు దీనిని అడ్డుకునే క్రమంలో హింసాత్మకంగా మారింది. నిరసనకారుల్లో నలుగురు చనిపోగా, ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు.
ట్రంప్ కావాలనే తన మద్దతుదారులను ప్రోత్సహించారంటూ ఆయనపై ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మెజారిటీ సభ్యులు మద్దతు పలకడంతో ట్రంప్ అభిశంసనకు గురయ్యారు. ఈ తీర్మానాన్ని సెనేట్‌కు పంపనున్నారు. కాగా, ఈ నెల 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారు. అనంతరం ట్రంప్‌పై విచారణ జరగనుంది.