కోలీవుడ్ దర్శకుడితో రామ్ తదుపరి సినిమా?

13-01-2021 Wed 21:40
  • రామ్ తాజా చిత్రం 'రెడ్' రేపు విడుదల 
  • నేసన్ దర్శకత్వంలో తదుపరి సినిమా
  • చర్చల దశలో త్రివిక్రమ్ తో ప్రాజక్టు  
Ram to work with Tamil director

తన ఎనర్జీనంతా గుమ్మరించి క్యారెక్టర్లో ఒదిగిపోయే హీరోలలో రామ్ ను ముందుగా చెప్పుకోవాలి. తొలిచిత్రం 'దేవదాసు' నుంచీ రామ్ ప్రతి చిత్రంలోనూ ఎంతో ఎనర్జీతో కనిపిస్తుంటాడు. అటువంటి ఎనర్జిటిక్ హీరో రామ్ తాజాగా నటించిన చిత్రం 'రెడ్'. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రేపు థియేటర్లలో విడుదల కానుంది.

ఇదిలావుంచితే, రామ్ నటించే తదుపరి సినిమా ఏమిటన్నది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే, కోలీవుడ్ దర్శకుడితో రామ్ తదుపరి సినిమా వుండచ్చని తెలుస్తోంది. నేసన్ దర్శకత్వంలో ఇతని తదుపరి సినిమా ఉంటుందని వార్తలొస్తున్నాయి. ఇందుకు సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయనీ, త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు.

మరోపక్క, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా రామ్ ఓ సినిమా చేయనున్నాడు. ఈ విషయాన్ని ఇటీవల రామ్ కూడా ధ్రువీకరించాడు. ఈ సినిమా చర్చల దశలో ఉందనీ, అయితే ఇంకా దీనిపై క్లారిటీ రాలేదనీ రామ్ చెప్పాడు.