ప్రజలు ఎందుకు ఓడించారో చంద్రబాబుకు ఇప్పటికీ తెలియడం లేదు!: బొత్స విసుర్లు

13-01-2021 Wed 21:18
  • ప్రజల ఆలోచనలకు భిన్నంగా చంద్రబాబు ఉంటారు
  • ఓడిపోయాననే పశ్చాత్తాపం కూడా ఆయనలో లేదు
  • పేదలకు పట్టాలు ఇచ్చిన చరిత్ర చంద్రబాబుకు ఎప్పుడైనా ఉందా?
Botsa fires on Chandrababu

ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోతోందంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, అభివృద్ధి కోసమే రాష్ట్ర అప్పు పెరిగిందని, అవినీతి కోసం కాదని అన్నారు. చంద్రబాబు గాలి మాస్టర్ అని... అందుకే గాలి మాటలు మాట్లాడతారని విమర్శించారు.

ప్రజల ఆలోచనలకు భిన్నంగా చంద్రబాబు ఉంటారని అన్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఇప్పుడు వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఎందుకు ఓడించారో చంద్రబాబుకు ఇప్పటికీ తెలియడం లేదని... ఓడిపోయాననే పశ్చాత్తాపం కూడా ఆయనలో లేదని అన్నారు.

పోలవరం ప్రాజెక్టు, అమరావతిలను ఏటీఎం కార్డులుగా చంద్రబాబు వాడుకున్నారని బొత్స విమర్శించారు. అమరావతిలో వేలాది ఎకరాల భూములను బంధువులతో కొనిపించిన ఘనుడు చంద్రబాబు అని అన్నారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిని చేస్తే చంద్రబాబుకు ఏం నష్టమని ప్రశ్నించారు. పేదలకు పట్టాలు ఇచ్చిన చరిత్ర చంద్రబాబుకు ఎప్పుడైనా ఉందా? అని అడిగారు.