Bhuma Akhila Priya: ముగిసిన అఖిలప్రియ పోలీస్ కస్టడీ.. 300 ప్రశ్నలు అడిగిన పోలీసులు!

  • కాసేపటి క్రితం ముగిసిన మూడు రోజుల కస్టడీ
  • కీలక విషయాలను పోలీసులు రాబట్టినట్టు సమాచారం
  • రేపు మధ్యాహ్నం కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు
Akhila Priyas 3 days police custody over

హైదరాబాద్ బోయిన్ పల్లిలో ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసులో టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఏ1గా ఉన్న సంగతి తెలిసిందే. కాసేపటి క్రితం ఆమె మూడు రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. మూడు రోజుల విచారణలో ఆమె నుంచి పోలీసులు కీలక విషయాలను రాబట్టినట్టు తెలుస్తోంది.

పోలీసులు అడిగిన ప్రశ్నలకు తొలుత దాటవేత ధోరణిని అవలంబించిన అఖిలప్రియ... ఆ తర్వాత కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్టు సమాచారం. సాంకేతిక ఆధారాలను కూడా ముందుంచడంతో... కొన్నింటిని ఆమె ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం అఖిలప్రియను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

అఖిలప్రియను నార్త్ జోన్ డీసీపీ కమలేశ్వర్, ఇద్దరు ఏసీపీల బృందం ప్రశ్నించింది. ఆమెను దాదాపు 300 ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. ఈ కేసులో మొత్తం 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని... రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.

More Telugu News