Janasena: నలుగురు సభ్యులతో రామతీర్థ పోరాట కమిటీని ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్

  • పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు
  • సభ్యులుగా యశస్విని, అప్పారావు, బొడ్డిపల్లి రఘు
  • బీజేపీతో కలిసి కమిటీ పని చేస్తుందని జనసేన ప్రకటన
Pawan Kalyan appoints Janasena Rama Theertha Committe with 4 members

విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహానికి శిరచ్ఛేదన చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత విపక్షాలు అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. రామతీర్థంకు టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లినప్పుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెళ్లేందుకు యత్నించినప్పుడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో రామతీర్థ పోరాట కమిటీని జనసేనాని పవన్ కల్యాణ్ ఏర్పాటు చేశారు.

పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకర్ ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. కమిటీ సభ్యులుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు పాలవలస యశస్విని, ఉత్తరాంధ్ర ప్రాంతీయ కమిటీ సభ్యులు గడసాల అప్పారావు, డాక్టర్ బొడ్డిపల్లి రఘుని నియమించారు. ఈ మేరకు జనసేన పార్టీ నుంచి ప్రకటన వెలువడింది.

రామతీర్థంలో స్వామికి అపచారం జరిగి వారాలు గుడుస్తున్నా ఈ కేసులో ఇంత వరకు ఎటువంటి పురోగతి లేదని ఈ సందర్భంగా జనసేన విమర్శించింది. తమకు స్వేచ్ఛను ఇస్తే ఎలాంటి కఠినమైన కేసులనైనా గంటల వ్యవధిలోనే పరిష్కరిస్తామని ఆఫ్ ది రికార్డుగా పోలీసులు చెపుతుంటారని... ఈ నేపథ్యంలో, ఈ కేసులో పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వలేదని అనుమానించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపింది. ఈ కేసులో సత్వర న్యాయం జరిగేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు బృందంతో కలిసి ఈ కమిటీ పని చేస్తుందని చెప్పింది. జనసేన కార్యకర్తలను అవసరమైన సమయాలలో సమాయత్తం చేస్తూ, బీజేపీతో సమన్వయం చేసుకుంటూ ఈ కమిటీ పని చేస్తుందని తెలిపింది.

More Telugu News