అంగన్ వాడీ కేంద్రాలపై జనవరి 31లోగా నిర్ణయం తీసుకోండి: సుప్రీంకోర్టు ఆదేశం

13-01-2021 Wed 14:58
  • కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో ప్రారంభించే అంశంపై నిర్ణయం తీసుకోండి
  • ఆహార భద్రత చట్టం ప్రకారం ప్రామాణిక పోషకాహారాన్ని అందించాల్సి ఉంది
  • విపత్తు నివారణ అధికారులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి
Supreme Court orders to take a decision on reopening of anganwadis

కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అంగన్ వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. అంగన్ వాడీ కేంద్రాలను పునఃప్రారంభించడంపై ఈ నెల 31లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కరోనా కంటైన్మెంట్ జోన్లలో మినహా ఇతర ప్రాంతాల్లో వీటిని ప్రారంభించే అంశంపై నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ మేరకు జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది.

గర్భిణులు, బాలింతలు, పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు ఆహార భద్రత చట్టం ప్రకారం ప్రామాణిక పోషకాహారాన్ని అందించాల్సి ఉందని... ఈ నేపథ్యంలో, అంగన్ వాడీ కేంద్రాలను తెరవాలని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, విపత్తు నివారణ అధికారులతో సంప్రదించిన తర్వాతే వీటి పునఃప్రారంభంపై తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

ఈ మేరకు కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖను కూడా ఆదేశించింది. అంగన్ వాడీ కేంద్రాలను పునఃప్రారంభించాలని కోరుతూ మహారాష్ట్రకు చెందిన దీపిక జగత్ రామ్ సహానీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం పైమేరకు ఆదేశాలను జారీ చేసింది.