UP: ఒకరి తర్వాత ఒకరు.. ఏడాది పాటు అత్యాచారం.. నెట్ లో వీడియో
- యూపీలోని బరేలీలో దారుణ ఘటన
- ఐదుగురు స్నేహితుల దాష్టీకం
- వీడియోలు తీసి బెదిరింపులు
- కొత్త ఏడాది రోజే నెట్ లో వైరల్
స్నేహితుడే కదా అని అతడిని నమ్మింది. పెళ్లి చేసుకుంటానంటే చనువుగా ఉంది. కానీ, ఆ నమ్మకాన్ని అతడు నిలబెట్టుకోలేదు. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తన నలుగురు స్నేహితులనూ ఆమెపైకి ఉసిగొల్పాడు. ఒకరి తర్వాత ఒకరు ఆమెపై దాష్టీకానికి పాల్పడ్డారు. చేసిన పాడు పనిని వీడియో తీసి నెట్ లో పెట్టి వైరల్ చేశారు. ఆ వీడియోను అడ్డం పెట్టుకుని ఏడాది పాటు ఆమెను చిత్రవధ చేశాడు. పదేపదే అఘాయిత్యానికి పాల్పడ్డారు అతడు, అతడి స్నేహితులు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో జరిగింది. ఈ కొత్త సంవత్సరం ప్రారంభాన్ని ఆ అమ్మాయి స్నేహితుడు చేదు కలగా మిగిల్చాడు. వీడియోలు, ఫొటోలను నెట్ లో పెట్టడం.. అవి ఇంటి దాకా చేరడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై కేసు నమోదు చేశామని, ఐదుగురు పరారీలో ఉన్నారని, వీలైనంత త్వరగా పట్టుకుంటామని బరేలీ ఏఎస్పీ సత్యనారాయణ్ ప్రజాపత్ చెప్పారు. ఆ వీడియోలను ఫార్వర్డ్ చేసిన వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు.