హెచ్​1బీ వీసాలపై మరో పిడుగు.. వేతన పెంపును ఖరారు చేసిన ట్రంప్​ సర్కార్​

13-01-2021 Wed 12:22
  • తుది నిబంధనలు ఖరారు చేసిన కార్మిక శాఖ
  • స్థాయిని బట్టి 35 నుంచి 90 పర్సంటైల్ పెంపు
  • జనవరి 14న అధికారిక ఉత్తర్వులు జారీ
  • అమెరికన్లకు న్యాయం చేసేందుకేనన్న కార్మిక మంత్రి
US agency issues final wage rules for H1Bs and green card holders higher wages to apply in a phased manner

పోతూ పోతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వద్ద ఉన్న అస్త్రశస్త్రాలన్నింటినీ ప్రయోగిస్తున్నారు. మొన్నటికి మొన్న ప్రతిభ ఉన్నవారికే హెచ్1బీ వీసాలిచ్చేలా నోటిఫికేషన్ ఇచ్చిన అమెరికా ప్రభుత్వం.. తాజాగా మంగళవారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) తుది వేతన నిబంధనలను విడుదల చేసింది. హెచ్1బీ వీసా లేదా గ్రీన్ కార్డ్ (శాశ్వత నివాసం)పై పనిచేసే ఉద్యోగులకు ఆయా సంస్థలు జీతాలను పెంచేలా ఆ దేశ కార్మిక శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 14 నుంచి ఈ కొత్త నిబంధనను ప్రభుత్వం తన అధికారిక రిజిస్టర్ లో ప్రచురించనుంది. అప్పటి నుంచి 60 రోజుల్లోగా దీనిని అమలు చేస్తారు.

ఇంతకుముందు గతేడాది అక్టోబర్ 8న వేతనాలు పెంచే విషయంపై మధ్యంతర తుది నిబంధనలను తీసుకొచ్చారు. అయితే, దీనిపై టెక్నాలజీ, విద్యా రంగం, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మూడు జిల్లా కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలు చేశారు. కొత్త నిబంధనలను పరిపాలనా విధాన చట్టం ప్రకారం పొందుపరచలేదని, ప్రజాభిప్రాయం తీసుకున్నాకే వాటిని అమలు చేయాలని మూడు కోర్టులూ తీర్పు చెప్పాయి. దీంతో వాటిని కార్మికశాఖ పక్కన పెట్టింది. ఇప్పుడు తాజాగా కొత్తగా తుది నిబంధనలను ఇచ్చింది.

‘‘గతేడాది అక్టోబర్ 28న తీసుకొచ్చిన వేతన నిబంధనలపై ప్రజాభిప్రాయాలను సేకరించాం. అందరి అభిప్రాయాలు, వ్యాఖ్యలను లోతుగా సమీక్షించాక వేతన పెంపులో కొన్ని మార్పులు చేశాం. ఇంతకుముందున్న నిబంధనల వల్ల ఉద్యోగాల్లో అమెరికన్లకు తీవ్రమైన అన్యాయం జరుగుతోంది. అందుకే మార్పులతో తుది నిబంధనలపై ఉత్తర్వులిచ్చాం’’ అని కార్మిక శాఖ పేర్కొంది.

వీసా ప్రోగ్రామ్ లలో లోటుపాట్లను, విదేశీ ఉద్యోగులకు వేతన భద్రతను కల్పిస్తూ.. విదేశీయులకు తక్కువ జీతాలుండడం వల్ల నష్టపోతున్న అమెరికన్లకు మేలు చేస్తూ ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చామని కార్మిక శాఖ మంత్రి యూజీన్ స్కేలియా చెప్పారు. అమెరికా చట్టసభ కోరుకున్నట్టే అమెరికన్ల ప్రయోజనాలను కాపాడుతూ విదేశీ ఉద్యోగులను తీసుకునేలా ఈ కొత్త నిబంధనలు ఉపకరిస్తాయన్నారు. దీని వల్ల దేశంలోని నిరుద్యోగులకు మంచి వేతనంతో కూడిన ఉపాధి లభిస్తుందన్నారు. అయితే, మార్కెట్ లో ఉన్న కనీస వేతనానికి తక్కువ కాకుండా పెంపు ఉండేలా చూశామన్నారు.

కాగా, ప్రస్తుతం తీసుకొచ్చిన తుది నిబంధనల ప్రకారం భౌగోళిక ప్రాంతం ఆధారంగా నాలుగు స్థాయుల్లోని ఉద్యోగులకూ వేర్వేరుగా వేతన పెంపు చేయాల్సి ఉంటుంది. ప్రథమ స్థాయిలోని ఉద్యోగులకు ప్రస్తుతం వేతనాలు 17 పర్సంటైల్ ఉండగా.. గతేడాది 45 పర్సంటైల్ కు పెంచుతూ ఉత్తర్వులిచ్చారు. ఇప్పుడు దానిని 35 పర్సంటైల్ గా ఖరారు చేశారు. అదే ద్వితీయ స్థాయి ఉద్యోగులకు 34 పర్సంటైల్ ఉండగా.. 62 పర్సంటైల్ కు పెంచి.. 53 పర్సంటైల్ కు తుదిగా ఫైనల్ చేశారు. తృతీయ స్థాయి ఉద్యోగులకు 50 పర్సంటైల్ నుంచి 78 పర్సంటైల్ కు.. దానిని 72 పర్సంటైల్ కు మార్చారు. నాలుగో స్థాయి ఉద్యోగులకు 67 నుంచి 95కు పెంచి.. 90 పర్సంటైల్ గా ఖరారు చేశారు.

పర్సంటైల్ వేతనమంటే..?

ఓ సంస్థలో పనిచేస్తున్న వివిధ స్థాయుల ఉద్యోగులు, వారి వేతనాల్లో తేడాల సగటును అంచనా వేసి నిర్ణయించే వేతనాన్నే పర్సంటైల్ వేతనం అంటారు. ఉదాహరణకు రోజూ 500 రూపాయల కన్నా తక్కువ వేతనానికి పని చేసే వాళ్లు ఓ సంస్థలో 10 శాతం ఉన్నారనుకుందాం.. మిగతా 90 శాతం మంది 500పైన సంపాదించే వారు ఉంటారు. ఇలా వివిధ విభాగాల వారీగా ఎంత మంది ఎంతెంత సంపాదిస్తున్నారో సగటు తీసి.. దాని ఆధారంగా తుది పర్సంటైల్ వేతనాన్ని  లెక్కిస్తారు.