హైదరాబాద్ సమీపంలో బీజేపీ నేత ఆత్మహత్య!

13-01-2021 Wed 09:33
  • ఇటీవల బీజేపీలో చేరిన సంరెడ్డి వెంకటరెడ్డి
  • పలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఏజంట్ గా విధులు
  • ఓ భూ వివాదం నేపథ్యంలో ఆత్మహత్య
BJP Leader Sucide Near Hyderabad

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి, బీజేపీ నేత, తుర్కయాంజల్ పరిధిలోని తొర్రూర్ కు చెందిన 65 ఏళ్ల సంరెడ్డి వెంకట రెడ్డి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. శ్రీమిత్ర, జన చైతన్య, జీపీఆర్, స్పెక్టార్ తదితర సంస్థల ప్రతినిధిగా పనిచేస్తూ, దాదాపు ఆరు వేల ఎకరాల భూముల విక్రయాల్లో ఆయనకు ప్రమేయం ఉన్నట్టు గ్రామస్థుల ద్వారా తెలుస్తోంది. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన, ఆపై బీజేపీలో చేరి, కౌన్సిలర్ గా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.

కాగా, ఓ భూమికి సంబంధించిన విషయంలో నెలకొన్న తీవ్ర వివాదంలో మనస్తాపం చెందిన వెంకటరెడ్డి   ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. తన పొలం వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆయన నిప్పంటించుకోగా, దాన్ని గమనించిన స్థానికులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ, నిన్న సాయంత్రం మరణించారని తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.