Corona Virus: ప్రజా ప్రతినిధులకు టీకా లేదన్న ప్రధాని... ఇవ్వాలని అంటున్న పుదుచ్చేరి సీఎం!
- మరో 3 రోజుల్లో ఇండియాలో వ్యాక్సినేషన్
- తొలి దశలో వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి
- ప్రజా ప్రతినిధులకు ఇవ్వాలని కోరిన నారాయణ స్వామి
కరోనా మహమ్మారిని నిలువరించేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ 16 నుంచి ఇండియాలో ప్రారంభం కానుంది. తొలి దశలో ప్రజా ప్రతినిధులకు టీకాను ఇవ్వడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేయగా, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తొలి దశలోనే రాజకీయ నాయకులందరికీ టీకాను ఇవ్వాలని మోదీని ఉద్దేశిస్తూ లేఖ రాశారు.
సీఎంలు, మంత్రులు, శాసన సభ్యులకు టీకాను కేటాయించాలని, వారందరికీ టీకా ఇస్తేనే, దాన్ని తాము కూడా వేసుకోవచ్చన్న నమ్మకాన్ని ప్రజల్లో పెంచవచ్చని నారాయణ స్వామి అభిప్రాయపడ్డారు. కాగా, మరో 3 రోజుల్లో టీకా పంపిణీ ఇండియాలో ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఇప్పటికే వ్యాక్సిన్ వయల్స్ పలు రాష్ట్రాలకు చేరుకున్న సంగతి తెలిసిందే. తొలి దశలో వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య శాఖ ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇవ్వాలన్నది ప్రభుత్వ నిర్ణయం.