Raghu Rama Krishna Raju: కోళ్లను ఎత్తుకెళ్తున్నారంటూ పోలీసులపై రఘురామకృష్ణరాజు మండిపాటు

  • జీవనోపాధి కోసం కొందరు కోళ్లను పెంచుతున్నారు
  • కోర్టు ఆదేశాల సాకుతో పోలీసులు కోళ్లను ఎత్తుకెళ్తున్నారు
  • కోళ్లను తీసుకెళ్లేవారు దొంగలతో సమానమే
Raghu Rama Krishna Raju fires on police

సంక్రాంతి పండుగ నేపథ్యంలో అందరూ వారి సొంతూళ్లకు చేరుకుంటున్నారు. పండుగ సందర్భంగా కోడిపందేలు, ఇతర ఆటలకు పలు చోట్ల ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇదే సమయంలో పందేలను నిర్వహించకూడదంటూ పోలీసులు వార్నింగులు ఇస్తున్నారు. పలుచోట్ల దాడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు.

ఏపీలో కోడిపందేల సాకుతో అమాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కత్తులు కట్టి పందేలను నిర్వహిస్తేనే నేరమని కోర్టు చెప్పిందని... పందెం కోళ్లను పెంచితే నేరమని చెప్పలేదని అన్నారు. జీవనోపాధి కోసం కొందరు కోళ్లను పెంచుతున్నారని... కోళ్లను తీసుకెళ్తూ వారి జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు. కోర్టు ఆదేశాల సాకుతో పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని విమర్శించారు.

కోళ్లను తీసుకెళ్లేవారు దొంగలతో సమానమేనని అన్నారు. దొంగలకు ఏ విధంగా బుద్ధి చెపుతారో... కోళ్లను ఎత్తుకెళ్తున్న వారికి కూడా అలాగే బుద్ధి చెప్పాలని సూచించారు. విగ్రహాలను ధ్వంసం చేసేవారిపై ఏ ప్రతాపమూ చూపని పోలీసులు... కోళ్లను పెంచే వారిపై మాత్రం ప్రతాపం చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. పోలీసులు తీరు మార్చుకోవాలని హితవు పలికారు.

More Telugu News