Bird Flu: చికెన్, గుడ్లు తింటే బర్డ్ ఫ్లూ రాదు: తెలంగాణ ప్రభుత్వం

  • బర్డ్ ఫ్లూపై సమీక్ష నిర్వహించిన తలసాని, ఈటల
  • అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్న మంత్రులు
  • తెలంగాణలోకి బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశమే లేదని వ్యాఖ్య
Bird Flu wont harm says TS govt

ఓ వైపు కరోనా భయాలు కొనసాగుతుండగానే... మరోవైపు బర్డ్ ఫ్లూ పంజా విసురుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు బయటపడ్డాయి. పెద్ద సంఖ్యలో పక్షులు ప్రాణాలు కోల్పోతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. చికెన్, కోడిగుడ్లు తినేందుకు వెనకడుగు వేస్తున్నారు. దీంతో వీటి విక్రయాలు దారుణంగా పడిపోతున్నాయి.

ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం దీనిపై సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశంలో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, పలు శాఖల అధికారులు, పౌల్ట్రీరంగ నిపుణులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ చికెన్, కోడిగుడ్లు తింటే బర్డ్ ఫ్లూ రాదని చెప్పారు. ఇలాంటి పుకార్లతో పౌల్ట్రీ పరిశ్రమ దారుణంగా నష్టపోతోందని అన్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ కు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని... ఈ వైరస్ వల్ల ఇప్పటి వరకు మనుషులకు ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు.

బర్డ్ ఫ్లూపై తెలంగాణ ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైందని, సరిహద్దు జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని... రాష్ట్రంలోకి బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశమే లేదని చెప్పారు. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని... ఇలాంటి తరుణంలో బర్డ్ ఫ్లూ గురించి తప్పుడు ప్రచారం చేయవద్దని విన్నవించారు.

More Telugu News