విజయ్ సేతుపతి సరసన కథానాయికగా బాలీవుడ్ భామ

12-01-2021 Tue 14:35
  • విజయ్ సేతుపతితో శ్రీరామ్ రాఘవన్ సినిమా
  • కథానాయికగా బాలీవుడ్ భామ కత్రిన కైఫ్
  • తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కే సినిమా    
Katrina Kaif opposite Vijay Setupati

హిందీ సినిమాలతో బిజీబిజీగా వున్న బాలీవుడ్ భామ కత్రిన కైఫ్ తాజాగా ఓ దక్షిణాది సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది. ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి హీరోగా రూపొందే సినిమాలో ఆమె కథానాయికగా నటించనున్నట్టు తెలుస్తోంది. ఆమధ్య హిందీలో 'అంధాదున్' వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు.

ఆమధ్య దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ ఓ భారీ హిందీ చిత్రాన్ని ప్రకటించాడు. వరుణ్ ధావన్ హీరోగా 'ఎక్కిస్' పేరిట రూపొందే ఆ చిత్రం భారీ బడ్జెట్టుతో నిర్మాణం జరుపుకుంటుందని పేర్కొన్నారు. అయితే, కరోనా మహమ్మారి నేపథ్యంలో బిజినెస్ కారణాల రీత్యా ఆ చిత్రాన్ని ప్రస్తుతం పక్కన పెట్టారు.

ఈ నేపథ్యంలో దర్శకుడు శ్రీరామ్ ఇప్పుడు విజయ్ సేతుపతి, కత్రిన కాంబినేషన్లో చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఇది తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతుందని అంటున్నారు. కత్రిన బాలీవుడ్ లో అగ్రతారగా రాణించక మునుపు దక్షిణాదిన ముఖ్యంగా తెలుగులో కొన్ని సినిమాలు చేసిన సంగతి విదితమే!