Supreme Court: కొత్త వ్యవసాయ చట్టాలపై స్టే విధించిన సుప్రీం.. సమస్య పరిష్కారానికి కమిటీ ఏర్పాటు!

Supreme Court stays new farm acts

  • తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు స్టే కొనసాగింపు  
  • సమస్య పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు
  • పరిష్కారం కావాలనుకునే వారు కమిటీని కలవాలని సూచన

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై స్టే విధించింది. తాము తదుపరి ఉత్తర్వులను ఇచ్చేంత వరకు ఈ చట్టాలపై స్టే కొనసాగుతుందని తెలిపింది. ఈ చట్టాలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన రైతుల సమస్యలను పరిష్కరించే క్రమంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పింది. ఈ కమిటీలో భూపేందర్ సింగ్ మాన్, ప్రమోద్ జోషి, అశోక్ గులాటి, అనిల్ ధన్వంత్ లు సభ్యులుగా ఉంటారని తెలిపింది.

కేంద్ర ప్రభుత్వాన్ని శిక్షించాలనేది ఈ కమిటీ ఉద్దేశం కాదని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. కేవలం రైతుల సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతోనే కమిటీని వేస్తున్నట్టు తెలిపింది. సమస్య పరిష్కారం కావాలని కోరుకునే వారంతా కమిటీని సంప్రదించవచ్చని చెప్పింది.

ఈ నేపథ్యంలో కమిటీ ముందుకు వచ్చేందుకు రైతులు సిద్ధంగా లేరని వారి తరపు న్యాయవాది ఎంఎల్ శర్మ ధర్మాసనానికి విన్నవించగా... ఇలాంటి మాటలను వినేందుకు తాము సిద్ధంగా లేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమస్య పరిష్కారం కావాలని కోరుకునే వారు కమిటీ ముందుకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది. కమిటీని నియమించే అధికారం తమకు ఉందని ధర్మాసనం పేర్కొంది. క్షేత్ర స్థాయిలో రైతులు ఏం అనుకుంటున్నారో కూడా తాము తెలుసుకోవాలనుకుంటున్నామని చెప్పింది.

Supreme Court
New Farm Laws
NDA
  • Loading...

More Telugu News