KCR: కలెక్టర్లు చేతులు దులుపుకుంటే ఆశించిన ఫలితం రాదు: సీఎం కేసీఆర్

CM KCR reviews revenue matters and Dharani portal
  • రెవెన్యూ అంశాలు, ధరణి పోర్టల్ పై సీఎం సమీక్ష
  • గతంలో రెవెన్యూ విధానం అస్తవ్యస్తంగా ఉండేదని వెల్లడి
  • అందుకే నూతన రెవెన్యూ చట్టం తెచ్చామని వివరణ
  • కలెక్టర్లు, అధికారులకు సమీక్షలో దిశానిర్దేశం
నూతన రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్, భూముల రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై సీఎం కేసీఆర్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ ఏర్పడక ముందు రెవెన్యూ రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండేదని, దాని ఫలితంగా అనేక వివాదాలు ఏర్పడేవని వెల్లడించారు. రికార్డుల వివరాలు స్పష్టంగా లేకపోవడం వల్ల జరిగే అనర్ధాలను రూపుమాపేందుకు తమ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందని అన్నారు.

భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన, కొత్త పాస్ పుస్తకాల అందజేత, నూతన రెవెన్యూ చట్టం తదితర సంస్కరణలతో భూ యాజమాన్య విషయంలో స్పష్టత వస్తోందని అన్నారు. ఈ క్రమంలో తాము తీసుకువచ్చిన ధరణి పోర్టల్ నూటికి నూరు శాతం సఫలం అయిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్ల విషయంలో మరింత వెసులుబాటు కలిగించేందుకు వీలుగా వారం రోజుల్లో ధరణి పోర్టల్ లో అవసరమైన మార్పులు చేయాలని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్  మరింత సులభతరంగా ఉండేలా మార్చాలని తెలిపారు.

ఎన్నారైలు పాస్ పోర్టు నెంబరు ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ధరణి పోర్టల్ లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని వివరించారు. గతంలో ఆధార్ నెంబర్ ఇవ్వనివారి వివరాలు ధరణి పోర్టల్ లో నమోదు చేయలేదని, అలాంటివాళ్లకు మరో అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఆధార్ నెంబరు నమోదు చేసుకుని పాస్ పుస్తకం ఇవ్వాలని సూచించారు.

ఇక, రెవెన్యూ పరమైన అంశాలను జిల్లా కలెక్టర్లే స్వయంగా పరిష్కరించాలని కోరారు. సాదాబైనామాల క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులను కలెక్టర్లు పరిశీలించి పరిష్కరించాలని పేర్కొన్నారు. ఇప్పటివరకు రెవెన్యూ కోర్టుల పరిధిలో ఉన్న అంశాలను ఇకపై కలెక్టర్ నేతృత్వంలో ఏర్పడే జిల్లాస్థాయి ట్రైబ్యునల్ లో పరిష్కరించాలని స్పష్టం చేశారు. రెవెన్యూ పరమైన అంశాలను కిందిస్థాయి అధికారులకు అప్పగించి కలెక్టర్లు చేతులు దులుపుకుంటే ఆశించిన ఫలితం రాదని అన్నారు. కాబట్టి కలెక్టర్లే స్వయంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు.
KCR
Review
Revenue
Dharani Portal

More Telugu News