Telangana: తెలంగాణలో తెరుచుకోనున్న విద్యాసంస్థలు.. కీలక ఆదేశాలను జారీ చేసిన కేసీఆర్!

  • ఫిబ్రవరి 1 నుంచి తెరుచుకోనున్న విద్యాసంస్థలు
  • 9 నుంచి ఆపై తరగతులకు రెగ్యులర్ క్లాసులు
  • ప్రగతి భవన్ లో అత్యున్నత సమీక్ష నిర్వహించిన కేసీఆర్
Schools in Telangana to reopen from February 1

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను పునఃప్రారంభించాలని ఆయన ఆదేశించారు. 9వ తరగతి నుంచి ఆపై అన్ని తరగతులను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు, జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ, వైద్యారోగ్య, విద్య, మున్సిపల్, అటవీశాఖ ఉన్నతాధికారులతో ప్రగతిభవన్ లో ఈరోజు సీఎం అత్యున్నత సమీక్షను నిర్వహించారు.

ఈ భేటీలో ప్రధానంగా విద్యాసంస్థల ప్రారంభం పైనే సుదీర్ఘ చర్చ కొనసాగింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ, విద్యాసంస్థల నిర్వహణ సాధ్యమేనని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. దీంతో, పాఠశాలల పునఃప్రారంభానికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరో 20 రోజుల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. దాదాపు 10 నెలలుగా విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఉద్యోగ ఖాళీలన్నింటినీ ఒకేసారి భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. రెవెన్యూకు సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరించాలని అన్నారు. ధరణి పోర్టల్ లో నెలకొన్న సమస్యలను వారం రోజుల్లోగా పరిష్కరించాలని... అన్ని రకాల మార్పులు, చేర్పులు పూర్తి చేయాలని ఆదేశించారు.

వైకుంఠధామాల నిర్మాణాలను పూర్తి చేయాలని, వెంటనే వాటిని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. జనాభాకు సరిపడే విధంగా అన్ని పట్టణాల్లో సమీకృత మార్కెట్లను నిర్మించాలని ఆదేశించారు. అడవుల రక్షణకు ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో పదోన్నతులను కల్పించేందుకు కసరత్తును ప్రారంభించాలని ఆదేశించారు.

More Telugu News