Indian Army: సరిహద్దుల్లో పట్టుబడిన జవానును క్షేమంగా చైనాకు అప్పగించిన భారత్
- ఇటీవల గీత దాటివచ్చిన చైనా సైనికుడు
- విచారణ జరిపిన భారత సైన్యం
- తమ సైనికుడు అదృశ్యమయ్యాడన్న చైనా
- తమకు పట్టుబడ్డాడని వెల్లడించిన భారత్
ఈ నెల 8న లడఖ్ వద్ద వాస్తవాధీన రేఖకు సమీపంలో ఓ చైనా సైనికుడ్ని భారత బలగాలు అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. అతడు సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించడంపై సైన్యం విచారణ జరిపింది. అదే సమయంలో తమ సైనికుడు ఒకరు అదృశ్యమయ్యాడంటూ చైనా స్పందించింది. దాంతో ఆ సైనికుడు తమ అధీనంలో ఉన్నాడంటూ భారత సైన్యం ప్రకటించింది. ఆ సైనికుడ్ని క్షేమంగా అప్పగించాలంటూ చైనా చేసిన విజ్ఞప్తిని భారత సైన్యం మన్నించింది.
ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఆ సైనికుడిని సరిహద్దుల వద్ద చైనా బలగాలకు భద్రంగా అప్పగించింది. గతేడాది అక్టోబరులోనూ ఓ చైనా సైనికుడు ఇలాగే గీత దాటివస్తే అతడిని సైనిక లాంఛనాలతో చైనాకు అప్పగించారు. గాల్వన్ లోయ ఘర్షణల అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో చైనా సైనికులు సరిహద్దు దాటి వచ్చిన సమయాల్లోనూ భారత్ ఎంతో సంయమనం పాటిస్తోంది. ఇవాళ కూడా అదే తరహాలో వ్యవహరించి, చైనా సైనికుడ్ని సాగనంపింది. ఛుషుల్-మోల్దో సెక్టార్ వద్ద అతడిని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనా అధికారులకు అప్పగించింది.