Donald Trump: ట్రంప్ అభిశంసనకు సిద్ధం... ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి!
- ట్రంప్ వద్దని అత్యధికులు భావిస్తున్నారు
- ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ట్రంప్
- నేడే సభ ముందుకు తీర్మానం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను అభిశంసించేందుకు ప్రతినిధుల సభ సిద్ధంగా ఉందని స్పీకర్ నాన్సీ పెలోసీ వ్యాఖ్యానించారు. తన పరిపాలనలో చివరి రోజుల్లో ఆయనను పదవిలో కొనసాగించాలని అత్యధికులు భావించడంలేదని ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ను రాజ్యాంగంలోని 25వ సవరణ ద్వారా తొలగించే తీర్మానం సోమవారం నాడు సభ ముందుకు రానుందని తెలిపారు.
ఇదే సమయంలో ప్రస్తుత ఉపాధ్యక్షుడు, సెనేట్ అధ్యక్షుడిగా ఉన్న మైకపెన్స్, ఈ చట్ట సవరణ ద్వారా ట్రంప్ ను గద్దె దింపేందుకు అంగీకరించకుంటే, అభిశంసన అధికరణ ద్వారా ట్రంప్ ను తొలగించే దిశగా అడుగులు వేస్తామని ఆమె స్పష్టం చేశారు. అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ట్రంప్ అధ్యక్ష హోదాకు తగరని ఆమె వ్యాఖ్యానించారు.
కాగా, డెమొక్రాట్ర ఆధిపత్యం కలిగిన ప్రతినిధుల సభలో 2019 డిసెంబర్ లోనే ట్రంప్ ను అభిశంసించిన సంగతి తెలిసిందే. అయితే, సెనెట్ లో రిపబ్లికన్లకు మెజారిటీ ఉన్న కారణంగా నాటి తీర్మానం ఆమోదం పొందలేదు.
గత వారంలో వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ బిల్డింగ్ పై ట్రంప్ అనుచరులు దాడి చేయడం, ఆ సమయంలో ప్రతినిధులతో పాటు సెనెట్ సభ్యులు సైతం సమావేశమై ఉండటంతో తీవ్ర కలకలం రేగిన సంగతి విదితమే. ట్రంప్ స్వయంగా తన మద్దతుదారులను దాడికి పురికొల్పారని కూడా వార్తలు వచ్చాయి.
నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో తాను ఓటమి పాలైన రోజు నుంచి బైడెన్ విజయాన్ని ట్రంప్ ఎంత మాత్రమూ అంగీకరించడం లేదు. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్లు అక్రమ మార్గాల్లో గెలుపును సొంతం చేసుకున్నారని ఆయన ఆరోపిస్తూనే ఉన్నారు.