Bandi Sanjay: కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలి... ఆయన వద్ద నేను భాష నేర్చుకోవాలి: బండి సంజయ్

  • కేసీఆర్ పై ధ్వజమెత్తిన బండి సంజయ్
  • ఫాంహౌస్ కు వెళ్లి ఏంచేస్తాడో తెలియదని సందేహం
  • ఏమైనా అధికారిక కార్యక్రమాలు చేస్తుంటాడా అని వ్యాఖ్యలు
  • జల్సాలు పక్కనబెట్టి ప్రజల సమస్యలు గుర్తించాలని హితవు
  • భాష విషయంలో తన గురువు కేసీఆర్ అని వెల్లడి
Bandi Sanjay wishes CM KCR well being

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ ఫాంహౌస్ కు పోయి ఏంచేస్తాడో తెలియడంలేదని విమర్శించారు. ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటాడా? లేక అధికారిక కార్యక్రమాలు చేస్తుంటాడా? అని మండిపడ్డారు. ఇటీవల ఆయన ఎందుకు ఆసుపత్రికి వెళ్లాడో కూడా చెప్పలేదని, ఢిల్లీ వెళుతున్నా చెప్పడని, అక్కడ ఏంజరిగిందో కూడా చెప్పడని విమర్శించారు. ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిని చేసింది ఫాంహౌస్ లో, ప్రగతి భవన్ లో పడుకోవడానికి కాదు అని వ్యాఖ్యానించారు.

తనకు ఒక విషయంలో ఆశ్చర్యం వేస్తుందని, తన కార్యక్రమాలకు సంబంధించి ముందస్తు షెడ్యూల్ ప్రకటించని ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ ఒక్కడేనని తెలిపారు. ప్రగతి భవన్ లో ఉంటూ కూడా కనీసం తన మంత్రులకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వడని, అడిగితే బిజీ అంటారని, కానీ ఏంచేస్తుంటాడో తెలియదని పేర్కొన్నారు. అన్నీ అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకుంటారని, కొన్నిరోజుల తర్వాత ఆ నిర్ణయాలపై యూటర్న్ తీసుకుంటారని ఆరోపించారు.

అయితే కేసీఆర్ అష్టైశ్వరాలతో ఆరోగ్యంగా ఉండాలనే తాను కోరుకుంటానని, ఆయన వద్ద తాను భాష నేర్చుకోవాలని వ్యంగ్యం ప్రదర్శించారు. భాష విషయంలో ఆయన తన గురువు అని తెలిపారు. ఓ వ్యక్తి నాశనం కావాలని బీజేపీ ఎప్పుడూ కోరుకోదని స్పష్టం చేశారు.

తాజా పరిణామాలపైనా బండి సంజయ్ స్పందించారు. కేటీఆర్ ను సీఎం చేయడానికి అనారోగ్యాన్ని సాకుగా చూపాలా? అంటూ విమర్శించారు. కేటీఆర్ కేబినెట్ లో పదవుల కోసం పార్టీలో అప్పుడే కొట్లాట షురూ అయిందని వెల్లడించారు. కేటీఆర్ కేబినెట్లోకి తీసుకోకుంటే కొత్త పార్టీ పెట్టేందుకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకు తింటున్నారని, తన వాళ్ల ఆగడాల పట్ల ఖండించాల్సిన సీఎం మరింత దిగజారిపోయారని విమర్శించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో పాలన అంతా కాంట్రాక్టర్లు, బ్రోకర్ల చేతిలో నడుస్తోందని ఆరోపించారు. 2023లో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని స్పష్టం చేశారు. కొందరు ఇష్టం వచ్చినట్టు మొరుగుతున్నారని, వారందరినీ తాము గుర్తుంచుకుంటామని చెప్పారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ఫాంహౌస్, ప్రగతిభవన్ లను వీడి, జల్సాలను పక్కనబెట్టి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని బండి సంజయ్ పేర్కొన్నారు.

More Telugu News