Donald Trump: రేపే అభిశంసన... ట్రంప్ వద్దంటున్న డెమొక్రాట్లకు రిపబ్లికన్ల మద్దతు!

TrumpImpeachment Likely Tomarrow

  • మరిన్ని దాడులు జరగవచ్చని ఇంటెలిజెన్స్ సమాచారం
  • అధ్యక్ష పదవికి ట్రంప్ సరికాడంటున్న డెమొక్రాట్లు
  • రేపు ప్రతినిధుల సభ ముందుకు రానున్న తీర్మానం
  • రెండు రోజుల చర్చ తరువాత సెనేట్ ముందుకు

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ భవంతిపై ట్రంప్ అనుచరులు దాడి చేసిన ఘటనలో నిఘా వైఫల్యం బయటపడటం, ట్రంప్ వర్గీయులు మరిన్ని దాడులకు తెగబడవచ్చని ఇంటెలిజెన్స్ సంస్థలు హెచ్చరించిన తరువాత, సాధ్యమైనంత త్వరగా ఆయన్ను అభిశంసించాలని యూఎస్ కాంగ్రెస్ భావిస్తోంది. ట్రంప్ ఒక్క రోజు కూడా అధ్యక్ష పదవిలో ఉండేందుకు అర్హుడు కాదని డెమొక్రాట్లు భావిస్తుండటంతో, ఆయనకు వ్యతిరేకంగా పలువురు రిపబ్లికన్లు సైతం మద్దతిస్తుండటం గమనార్హం.

6వ తేదీన జరిగినట్టే మరోమారు అరాచక శక్తులు విజృంభించి, బైడెన్ ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని భగ్నం చేసే ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉండటంతో వాషింగ్టన్ లో నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నాడే ట్రంప్ ను అభిశంసించే ప్రక్రియను ప్రారంభించాలని డెమొక్రాట్లు నిర్ణయించారు. ఈలోగా ఆయనే స్వచ్ఛందంగా వైదొలగాలని, అప్పుడే కొంతైనా పరువును మిగుల్చుకున్న వారవుతారని హెచ్చరిస్తున్నారు.

ఇదే విషయాన్ని స్పష్టం చేసిన స్పీకర్ నాన్సీ పెలోసీ, తక్షణం ఆయన గద్దె దిగాలని స్పష్టం చేశామని, లేకుంటే రెండోసారి అభిశంసించడానికి వెనుకాడబోమని ట్రంప్ కు తెలియజేశామని అన్నారు. అధ్యక్ష పదవిలో ఉండి తిరుగుబాటును నడిపించిన ట్రంప్, ఆ పదవిలో ఉండేందుకు అర్హుడు కాదని తీర్మానం ముసాయిదాలో పేర్కొన్న సభ్యులు, రేపు సహాకమిటీ ముందుకు దీన్ని తేనున్నారని తెలుస్తోంది. ఆపై బుధ, గురువారాల్లో చర్చించి, తీర్మానం ఆమోదం పొందిన తరువాత సెనేట్ కు పంపాలన్న వ్యూహంలో డెమొక్రాట్ నేతలు ఉన్నారు.

కాగా, కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం ఈ ప్రక్రియకు కాస్తంత వ్యతిరేకంగానే ఉన్నట్టు సమాచారం. జనవరి 20కి మరో పది రోజులే ఉండటంతో, అధ్యక్ష మార్పిడి ప్రక్రియ సజావుగా సాగాలని ఆయన కోరుకుంటున్నారు. అమెరికన్లందరినీ ఏకం చేస్తానన్న తన హామీకి ఈ ప్రక్రియ వ్యతిరేకమని, రాజకీయాలు చేయాలని భావించడం లేదని బైడెన్ తన వర్గీయులతో వ్యాఖ్యానించారని సీఎన్ఎన్ వార్తా సంస్థ పేర్కొంది.

అభిశంసన వరకూ వెళ్లవద్దనుకుంటున్న ఆయన స్పీకర్ నాన్సీ పెలోసీతో మంతనాలు సాగిస్తున్నారని వెల్లడించింది. ఇదిలావుండగా, బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి తాను రాబోవడం లేదని ట్రంప్ చేసిన ప్రకటనను బైడెన్ స్వాగతించారు. తన ప్రమాణ స్వీకారానికి ట్రంప్ హాజరు కాకపోవడం మంచిదేనని అన్నారు.

  • Loading...

More Telugu News