Bhuma Akhila Priya: బెంగళూరా? పుణెనా?... ఇంకా తెలియని భార్గవ్ రామ్ ఆచూకీ!

  • పుణెలో ఉన్నట్టు పోలీసులకు సమాచారం
  • మహారాష్ట్రకు వెళ్లిన ప్రత్యేక బృందాలు
  • ఉస్మానియాలో అఖిలప్రియకు వైద్య పరీక్షలు
Special Team Went to Pune for Bhargav Ram

హైదరాబాద్ లో తీవ్ర కలకలం రేపిన కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో ప్రధాన నిందుతురాలిగా పోలీసులు పేర్కొన్న మాజీ మంత్రి అఖిలప్రియ చంచల్ గూడ జైల్లో ఉండగా, ఆమె భర్త మరో నిందితుడు భార్గవ్ రామ్ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఆయన కోసం బోయిన్ పల్లి పోలీసులు, ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి మూడు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. భార్గవ్ రామ్ బెంగళూరులోని తన స్నేహితుని వద్ద తలదాచుకున్నారని తొలుత వార్తలు రాగా, ఇప్పుడు ఆయన పుణెకు వెళ్లినట్టు పోలీసులకు సమాచారం అందినట్టు తెలుస్తోంది.

దీంతో మరో బృందం ఆయన ఆచూకీ కోసం పుణెకు వెళ్లింది. ఇక అపహరణకు గురైన కార్లను గుర్తించే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నారు. కిడ్నాప్ నకు వాడిన కార్లను ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. ఇదిలావుండగా, చంచల్ గూడ జైల్లో అఖిలప్రియను కలిసిన ఆమె తరఫు న్యాయవాదులు, బెయిల్ కోసం తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆమె అనారోగ్యంతో ఉన్నారని జైలు అధికారులకు తెలుపడంతో, నిన్న రెండు సార్లు ఉస్మానియా ఆసుపత్రిలో అఖిలప్రియకు వైద్య పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

వైద్య పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను రేపు ఉదయం సికింద్రాబాద్ కోర్టుకు సమర్పించనున్నట్టు చంచల్ గూడా జైలు పర్యవేక్షణాధికారి వెంకటలక్ష్మి వెల్లడించారు. తనకు గడచిన పదేళ్లుగా మూర్చవ్యాధి ఉన్నదని ఉస్మానియా వైద్యులకు అఖిలప్రియ వెల్లడించారు. వైద్య పరీక్షల తరువాత, న్యూరో ఫిజీషియన్ కు రిఫర్ చేస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు.

More Telugu News