Jawahar: పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామన్న ఏపీ ఉద్యోగ సంఘం నేతపై జవహర్ ఫైర్
- ఎన్నికలను ఆపేయాలన్న ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి
- స్వామిభక్తి ఎక్కువైతే వైసీపీ కండువా కప్పుకోవాలన్న జవహర్
- ఏ రెడ్డిని తృప్తి పరిచేందుకు అలా మాట్లాడారో చెప్పాలని నిలదీత
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ నిన్న రాత్రి నోటిఫికేషన్ ను విడుదల చేశారు. దీంతో, రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఎన్నికల నోటిఫికేషన్ ను విపక్షాలు స్వాగతిస్తుండగా... అధికార పార్టీ మాత్రం వ్యతిరేకిస్తోంది. కరోనా సమయంలో ఎన్నికల నిర్వహణ కుదరదని అంటోంది. పలువురు మంత్రులు ఏకంగా ఎస్ఈసీనే విమర్శించారు. ఒక కులానికి కొమ్ముకాయడానికే ఎన్నికలను నిర్వహిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, అవసరమైతే ఎన్నికలను ఉద్యోగులందరూ బహిష్కరిస్తారని అన్నారు. రాష్ట్రంలో కరోనా కొత్త స్ట్రెయిన్, బర్డ్ ఫ్లూ వంటివి ప్రబలుతున్నాయని.. వీటిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాము ఎన్నికల విధులను బహిష్కరిస్తామని చెప్పారు. న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ జరుగుతున్న సమయంలో నోటిఫికేషన్ విడుదల చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత తెలంగాణ, బీహార్ రాష్ట్రాల్లో కరోనా వ్యాపించిందని అన్నారు. ఎస్ఈసీ మొండిగా నోటిఫికేషన్ ను విడుదల చేశారని చెప్పారు.
ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. చంద్రశేఖర్ రెడ్డి ఉద్యోగుల సంఘం నాయకుడా? లేక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనుచరుడా? అని ప్రశ్నించారు. స్వామిభక్తి ఎక్కువైతే చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ కండువా వేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. ఎస్ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టుకు వెళ్తామని చంద్రశేఖర్ రెడ్డి అంటున్నారని... ఏ రెడ్డిని తృప్తి పరిచేందుకు ఆయన అలా మాట్లాడారో చెప్పాలని అన్నారు.