Andhra Pradesh: వ్యర్థాలను విడుదల చేయొద్దంటూ 'దివీస్' కు ఏపీ సర్కారు లేఖ
- తూర్పుగోదావరి జిల్లాలో దివీస్ పరిశ్రమపై అభ్యంతరాలు
- పరిశ్రమకు సమీపంలో హేచరీలు ఉన్నాయన్న సర్కారు
- వ్యర్థాలతో హేచరీలు దెబ్బతింటాయని వెల్లడి
- గ్రామీణ యువత ఉపాధి కోల్పోతుందని స్పష్టీకరణ
ఓవైపు జనసేనాని పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో దివీస్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ పర్యటన సాగిస్తున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానికుల జీవనాధారంపై ప్రభావం చూపించే వ్యర్థాలను విడుదల చేయొద్దంటూ దివీస్ ల్యాబరేటరీస్ యాజమాన్యానికి లేఖ రాసింది.
తుని నియోజకవర్గంలో దివీస్ పరిశ్రమకు అందించిన స్థలంలో ఆక్వా హేచరీలు ఉన్నాయని, పరిశ్రమ వ్యర్థాలతో హేచరీలకు నష్టం వాటిల్లితే వాటిపై ఆధారపడి ఉపాధి పొందుతున్న యువత ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఆ లేఖలో పేర్కొంది. గ్రామీణ యువత ఉపాధి కోల్పోయే పరిస్థితులు వస్తాయని ఏపీ పరిశ్రమల శాఖ డైరెక్టర్ జేవీఎన్ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. కాలుష్య నివారణ పద్ధతులు పాటించకుండా వ్యర్థాలను విడుదల చేయడం సరికాదని లేఖలో వెల్లడించారు.