Revanth Reddy: కేటీఆర్ పై ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి

  • కొత్తపేటలో వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం
  • ప్రకటిత సమయానికి ముందే ప్రారంభించారంటూ రేవంత్ ఆగ్రహం
  • స్థానిక ఎంపీని మరిచారని మండిపాటు
  • రోడ్డుపై బైఠాయింపు .. అరెస్ట్ చేసిన పోలీసులు!
Revanth Reddy calls KTR as KT Rao

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇవాళ హైదరాబాదులోని కొత్తపేటలో ఓ వాటర్ ట్యాంకు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అయితే, ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీని పిలవాలన్న ఇంగితజ్ఞానం లేదా? అంటూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. "మిస్టర్ కేటీ రావూ... ఫాంహౌస్ నుంచి తెచ్చిన సొమ్ములతో కాదు, ప్రజలు కష్టం చేసి కట్టిన పన్నులతో చేస్తున్న అభివృద్ధి" అని స్పష్టం చేశారు. ప్రారంభోత్సవంపై తప్పుడు సమాచారం ఇచ్చి, ముందే దొంగల్లా ముగించుకుని పోవాల్సిన అగత్యమేంటి? అని కేటీఆర్ ను ట్విట్టర్ లో ప్రశ్నించారు.

అంతకుముందు, కొత్తపేటలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ప్రకటించిన సమయం కంటే ముందే వాటర్ ట్యాంకు ప్రారంభించి వెళ్లిపోయారంటూ కేటీఆర్ కు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభోత్సవం కాగా, కేటీఆర్ ముందే ప్రారంభించి వెళ్లిపోయారు. దాంతో మంత్రి మల్లారెడ్డిని, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని రేవంత్ రెడ్డి నిలదీశారు. ప్రతిసారి ఇలాగే తప్పించుకునిపోయే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

అటు, ముషీరాబాద్ లోనూ కేటీఆర్ పై వ్యతిరేకత వ్యక్తమైంది. ముషీరాబాద్ లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన సందర్భంగా ప్రోటోకాల్ మరిచారంటూ బీజేపీ నేతలు కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. దాంతో అక్కడ కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

More Telugu News