కేజీఎఫ్-1కు మించిన యాక్ష‌న్ సీన్లు ఉంటాయి.. య‌శ్ తో త‌ల‌ప‌డ‌తాను: సంజ‌య్ ద‌త్

08-01-2021 Fri 12:15
  • కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా కేజీఎఫ్ 2
  • నా సినీ కెరీర్‌లో చాలా రకాల పాత్రలు పోషించా
  • అధీర పాత్రను ఎంజాయ్‌ చేస్తూ చేశా
  • మేకప్‌ వేసుకోవడానికే గంటన్నరకు పైగా స‌మ‌యం ప‌ట్టేది
more action scenes in kgf2

భారీ విజ‌యం సాధించిన క‌న్న‌డ సినిమా కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా కేజీఎఫ్ 2 సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటోంది. నిన్న కేజీఎఫ్ 2 టీజ‌ర్ నూ విడుద‌ల చేశారు. మిలియ‌న్ల కొద్దీ వ్య‌స్ తో ఈ టీజ‌ర్ దూసుకుపోతోంది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమాలో అతి ముఖ్య‌మైన విల‌న్ పాత్ర అధీరగా క‌న‌ప‌డనున్న‌ బాలీవుడ్ న‌టుడు సంజయ్ దత్ ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొని ప‌లు విష‌యాలు తెలిపారు.  

ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో పనిచేయడం చాలా సౌకర్యంగా అనిపించిందని చెప్పారు. ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడిందని, సినిమాపై ఆయన త‌న‌తో ఎన్నో అభిప్రాయాల‌ను పంచుకున్నారని తెలిపారు. త‌న సినీ కెరీర్‌లో చాలా రకాలు పాత్రలు పోషించానని, అయితే, అధీర పాత్రను ఎంజాయ్‌ చేస్తూ చేశాన‌ని తెలిపారు.

ఇందులో కేజీయఫ్‌ 1కు మించిన యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయని, ఇందులో హీరో యశ్‌, తానూ పోటా పోటీగా తలపడతామ‌ని చెప్పారు. ద‌య‌ లేని అతి క్రూరుడు   అధీరగా న‌టించాన‌ని, ఈ పాత్ర కోసం సిద్ధమవడానికి శారీరకంగా చాలా కష్టపడాల్సి వచ్చేదని తెలిపారు. అంతేగాక‌, మేకప్‌ వేసుకోవడానికే గంటన్నరకు పైగా స‌మ‌యం పట్టేదని చెప్పారు.