Hyderabad: హెల్మెట్ లేకుండా రోడ్డెక్కితే మరిన్ని కఠిన చర్యలకు సైబరాబాద్ పోలీసుల నిర్ణయం

stict actions to be taken on helmetless driving

  • హెల్మెట్ ధరించని కారణంగా గతేడాది 300 మంది మృతి
  • హెల్మెట్ లేకుండా పట్టుబడితే కొత్తది కొనుగోలు చేశాకే వదలాలని నిర్ణయం
  • తొలుత ఇబ్బంది పడినా తర్వాత అలవాటుపడతారంటున్న పోలీసులు

హెల్మెట్ లేకుండా రోడ్డెక్కేవారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు. రోడ్డు ప్రమాదాల్లో అత్యధికశాతం మరణాలకు హెల్మెట్ ధరించకపోవడమే కారణం కావడంతో ఈ విషయంలో మరింత కఠినంగా ముందుకెళ్లాలని భావిస్తున్నారు.

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గతేడాది 663 ప్రమాదాలు జరిగితే 700 మంది అసువులు బాసారు. వీరిలో 400 మంది ద్విచక్ర వాహనదారులు కాగా, హెల్మెట్ ధరించి ఉంటే వీరిలో కనీసం 300 మంది బతికి బయటపడేవారని తమ పరిశీలనలో తేలినట్టు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హెల్మెట్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.

హెల్మెట్ ధరించని వారికి చలానాలు విధిస్తున్నప్పటికీ చాలామంది చెల్లించకుండా యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు సైబరాబాద్ సీపీ సజ్జనార్ నిర్ణయించారు. హెల్మెట్ లేకుండా పట్టుబడితే అప్పటికప్పుడు కొత్త హెల్మెట్ కొనుగోలు చేయించి దానిని ధరించిన తర్వాత వదిలిపెట్టనున్నారు.

వెంటనే హెల్మెట్ తెచ్చుకున్నా, కొత్తది కొనుగోలు చేసినా కేసు నమోదు చేయకుండా వదిలిపెడతారు. లేదంటే మాత్రం కేసు నమోదు చేస్తారు. ఇలా చేస్తే వాహనదారులు తొలుత కొంత ఇబ్బందిపడినా, ఆ తర్వాత అలవాటుపడిపోతారని చెబుతున్నారు. తొలుత నాలుగు జాతీయ రహదారులపై దీనిని అమలు చేసి, ఆ తర్వాత అన్ని రోడ్లపైనా అమలు చేయనున్నారు.

Hyderabad
Cyberabad police
Helmet
Driving
  • Loading...

More Telugu News