Facebook: ట్రంప్ పై మండిపడుతూ... ఫేస్ బుక్ ఖాతాను నిరవధికంగా మూసేయించిన జుకర్ బర్గ్!

Facebook Closed Trump Account

  • క్యాపిటల్ బిల్డింగ్ లో నిన్న అవాంఛనీయ ఘటనలు
  • తన మద్దతుదారులను ప్రభావితం చేసిన ట్రంప్
  • అందుకు ఫేస్ బుక్ ను వాడుకున్నారన్న జుకర్ బర్గ్

నిన్న వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ బిల్డింగ్ లో జరిగిన ఘటనలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం కావడం, ఆపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకున్న ఫేస్ బుక్, కఠిన నిర్ణయం తీసుకుంది. డొనాల్డ్ ట్రంప్ ఖాతాను నిరవధికంగా రద్దు చేస్తున్నట్టు సంస్థ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ స్పష్టం చేశారు. నిన్న 24 గంటల పాటు ఆయన ఖాతాను ఫేస్ బుక్ బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఒకరోజు నిషేధాన్ని నిరవధిక నిషేధంగా మారుస్తున్నామని జుకర్ బర్గ్ ఓ ప్రత్యేక ప్రకటనలో తెలిపారు.

జో బైడెన్ కు అధికారాన్ని అప్పగించే ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోగా, వాటిని ట్రంప్, తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారని, అందుకు ఫేస్ బుక్ ను వాడుకుంటున్నారని ఈ సందర్భంగా జుకర్ బర్గ్ వ్యాఖ్యానించారు. తన పదవీ కాలంలో మిగిలివున్న సమయాన్ని సాధ్యమైనంత స్వలాభానికి వాడుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని, అందువల్లే ఖాతాను నిలిపివేశామని తెలిపారు.

అధికార మార్పిడిని అణగదొక్కేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని, తన మద్దతుదారుల చర్యలను సమర్ధిస్తున్నారని ఆరోపించిన ఫేస్ బుక్, ఇది ప్రపంచాన్నే కలవరపరిచే అంశమని వెల్లడించింది. ఇక మరో 13 రోజుల్లో అధ్యక్షుడు మారతాడని, ఈ సమయంలో ప్రజలు శాంతియుతంగా ఉండి, ప్రజాస్వామిక నిబంధనలకు అనుగుణంగా నడచుకోవాలని జుకర్ బర్గ్ కోరారు.

గత కొన్ని సంవత్సరాలుగా ట్రంప్, ఫేస్ బుక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వాడుకుంటూ లబ్ది పొందారని, ఈ క్రమంలో ఆయన చేసిన కొన్ని కామెంట్లు, పోస్టులను తొలగించడం కూడా జరిగిందని గుర్తు చేసిన జుకర్ బర్గ్, అయినా ఆయన ఖాతాను బ్లాక్ చేయలేదని గుర్తు చేశారు. ఇదే సమయంలో ఇప్పుడు ఉన్న సందర్భం మాత్రం ఎంతో విరుద్ధమైనదని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన హింసను ప్రేరేపించారని ఆరోపించారు.

అందుకోసం తమ ఫేస్ బుక్ ను ట్రంప్ వాడుకుంటున్నారని, ఈ తరహా విధానాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని జుకర్ బర్గ్ వ్యాఖ్యానించారు. అధికార మార్పిడి సజావుగా జరిగిన తరువాత ట్రంప్ ఖాతాను పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

Facebook
Mark Zukerberg
Donald Trump
Closed
  • Loading...

More Telugu News