Telangana: పట్టణ స్థానిక సంస్థల సంస్కరణలు అమలు చేసిన మూడో రాష్ట్రంగా తెలంగాణ... అదనపు రుణాలు పొందేందుకు అర్హత
- పట్టణ స్థానిక సంస్థల్లో సంస్కరణలు ప్రతిపాదించిన కేంద్రం
- అమలు చేసిన రాష్ట్రాలకు రుణసదుపాయం పొందే వీలు
- ఇప్పటికే సంస్కరణలు అమలు చేసిన ఏపీ, మధ్యప్రదేశ్
- ఈ రెండు రాష్ట్రాల సరసన చేరిన తెలంగాణ
- రూ.2,508 కోట్ల మేర రుణ సదుపాయం
పట్టణ స్థానిక సంస్థల సంస్కరణలను విజయవంతంగా అమలు చేసిన మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇప్పటికే ఏపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కేంద్రం ప్రతిపాదించిన ఈ సంస్కరణల అమలును పూర్తిచేశాయి. తాజాగా తెలంగాణ కూడా ఈ రెండు రాష్ట్రాల సరసన చేరింది. తద్వారా రూ.2,508 కోట్ల మేర రుణసాయం పొందేందుకు అర్హత సాధించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక వ్యయాల విభాగం తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి మంజూరు చేసింది.
పట్టణ, నగర ప్రాంతాల్లోని ప్రజలకు మరింత మెరుగైన ప్రాథమిక సదుపాయాలు, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం తదితర వసతుల ఏర్పాటు కోసం కేంద్రం అనేక సంస్కరణలు తీసుకువచ్చింది. వీటిని పూర్తిస్థాయిలో అమలు చేసిన రాష్ట్రాలకు అదనపు రుణాలు స్వీకరించే వెసులుబాటు కల్పిస్తోంది. ఈ క్రమంలో సంస్కరణలను విజయవంతంగా అమలు చేస్తున్న ఏపీ, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం రూ.7,406 కోట్ల రుణాలు పొందేందుకు వీలు కల్పిస్తూ ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది.