Telugudesam: జగన్ తమ ఆత్మ అని చెప్పే మఠాధిపతులు, స్వామీజీలు ఆలయాలపై దాడుల సమయంలో ఏం చేస్తున్నారు?: టీడీపీ నేతల ఆగ్రహం
- ఏపీలో ఆలయాలపై ఆగని దాడులు
- గవర్నర్ ను కలిసిన టీడీపీ బృందం
- సీబీఐ విచారణ కోసం చర్యలు తీసుకోవాలని వినతి
- ఏపీలో రాష్ట్రపతి పాలన రావాలన్న టీడీపీ నేతలు
- జగన్ ఏం ఘనకార్యాలు చేస్తున్నారంటూ ఆగ్రహం
ఏపీలో కొంతకాలంగా ఆలయాలపై దాడులు జరుగుతున్న ఘటనలపై టీడీపీ నేతలు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 144 ఘటనలు జరిగాయని తెలిపారు. గవర్నర్ తో భేటీ అనంతరం వర్ల రామయ్య, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, బుద్ధా వెంకన్న, శ్రవణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
జగన్ తమ ఆత్మ అని చెప్పిన కొందరు మఠాధిపతులు, స్వామీజీలు ఆలయాలపై దాడులు జరిగిన సమయంలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సదరు ఆధ్యాత్మికవేత్తలు హిందూ ధర్మాన్ని పరిరక్షించకుండా రాజకీయాల కోసమే ఉన్నారా? అని నిలదీశారు.
టీడీపీ హయాంలో ఆలయాలను తొలగించింది రహదారుల విస్తరణ కోసమేనని స్పష్టం చేశారు. అయితే జగన్ ఇప్పుడు వరుస దాడుల ఘటనలను పక్కదారి పట్టించే జగన్నాటకానికి తెరలేపారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పాలన సాగించే అర్హతను వైసీపీ కోల్పోయిందన్న టీడీపీ నేతలు, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని అన్నారు.
ఏపీలోని ఆలయాలపై 144 దాడులు జరిగాయని చెబితే, "ఇన్ని ఘటనలు జరిగాయా?" అని గవర్నర్ ఆశ్చర్యపోయారని వారు వెల్లడించారు. విగ్రహాల ధ్వంసం, ఇతర ఘటనలపై సీబీఐ విచారణ కోసం చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశామని తెలిపారు.
సీఎం, మంత్రుల వ్యాఖ్యలు దాడులను మరింత ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపించారు. వందల సంఖ్యలో ఆలయాలపై దాడి జరిగితే సీఎం జగన్ చేస్తున్న ఘనకార్యాలు ఏంటో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుపై కేసు పెట్టాలని భావిస్తే జరగబోయే విపత్కర పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.