Bhuma Akhila Priya: భూమా అఖిలప్రియ ఏ2 కాదు ఏ1... రిమాండ్ రిపోర్టులో కీలక వివరాలు!

  • 25 ఎకరాల భూమి చుట్టూ వివాదం
  • ముగ్గురు సోదరుల కిడ్నాప్
  • కిడ్నాప్ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి అఖిలప్రియ
  • రిమాండ్ రిపోర్టులో ఆమెను ఏ1గా పేర్కొన్న పోలీసులు
Bhuma Akhilapriya remand report details

ఏపీ టీడీపీ మహిళా నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఓ కిడ్నాప్ వ్యవహారంలో అరెస్టు కాగా, ఆమె రిమాండ్ రిపోర్టులో కీలక వివరాలు వెల్లడయ్యాయి. నిన్న అఖిలప్రియను ఏ2గా పేర్కొన్న పోలీసులు ఇవాళ ఆమెను రిమాండ్ రిపోర్టులో ఏ1గా పేర్కొనడం గమనార్హం. ఇదే విషయాన్ని ఆమె న్యాయవాది ఇవాళ జరిగిన బెయిల్ పిటిషన్ విచారణలో కోర్టుకు తెలిపారు. అఖిలప్రియను ఏ2 నుంచి ఏ1గా మార్చారని ఆరోపించారు.

ఇక, రిమాండ్ రిపోర్టు విషయానికొస్తే, నిన్న ఏ1గా పేర్కొన్న ఏవీ సుబ్బారెడ్డిని తాజాగా ఏ2గా నమోదు చేశారు. ఏ3గా అఖిలప్రియ భర్త భార్గవరామ్ ను పేర్కొన్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో ఇతర నిందితులుగా శ్రీనివాసరావు, చంటి, ప్రకాశ్, సాయిల పేర్లు నమోదు చేశారు. హఫీజ్ పేటలోని సర్వే నెంబర్ 80లో ఉన్న 25 ఎకరాల భూమి చుట్టూ నెలకొన్న వివాదమే ఈ కిడ్నాప్ కు దారితీసిందని పోలీసులు రిపోర్టులో వెల్లడించారు.

బాధితులు ప్రవీణ్ రావు, ఆయన సోదరులు 2016లో ఈ భూమిని కొనగా, ఆ భూములు తమవేనని అఖిలప్రియ, భార్గవరామ్, సుబ్బారెడ్డి చెప్పుకునేవారని... అయితే సుబ్బారెడ్డికి ప్రవీణ్ వర్గం డబ్బులిచ్చి వివాదాన్ని పరిష్కరించుకుందని వివరించారు. కాగా, ఆ భూమికి ఇటీవల ధర పెరగడంతో నిందితులు మరింత డబ్బు డిమాండ్ చేయడంతో మరోసారి వివాదం మొదలైందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రవీణ్ రావును, ఆయన ఇద్దరు సోదరులు నవీన్, సునీల్ ను కళ్లకు గంతలు కట్టి కిడ్నాప్ చేశారని పోలీసులు వివరించారు.

ఈ కేసులో అఖిలప్రియను అరెస్ట్ చేసిన పోలీసులు, ఏవీ సుబ్బారెడ్డిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం అతడికి సీఆర్పీసీ 41 కింద నోటీసులు ఇచ్చి విడుదల చేశారు.

అఖిలప్రియ భర్త భార్గవరామ్ పరారీలో ఉన్నాడు. అతడికోసం చెన్నై, బెంగళూరు నగరాల్లో ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. అఖిలప్రియకు ఈ వ్యవహారంతో సంబంధంలేదని ఆమె కుటుంబ సభ్యులు చెబుతుండగా, తనకే పాపం తెలియదని ఏవీ సుబ్బారెడ్డి అంటున్నాడు. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న భార్గవరామ్, అతడి సోదరుడు చంద్రహాస్ పట్టుబడితే ఈ వ్యవహారంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

More Telugu News