మారుతి దర్శకత్వంలో నటిస్తున్న గోపీచంద్!

07-01-2021 Thu 14:16
  • ప్రస్తుతం 'సీటీమార్' సినిమా చేస్తున్న గోపీచంద్ 
  • గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంయుక్త ప్రాజక్ట్ 
  • త్వరలోనే టైటిల్ సహా ఫస్ట్ లుక్ విడుదల     
Maruti to direct Gopichand

ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న 'సీటీమార్' చిత్రంలో నటిస్తున్న యాక్షన్ హీరో గోపీచంద్ తన తదుపరి చిత్రాన్ని మారుతి దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈ రోజు వెలువడింది.

ఆమధ్య 'ప్రతిరోజూ పండగే' వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు మారుతి కాస్త విరామం తర్వాత ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. మొదట్లో ఈ చిత్రంలో రవితేజ హీరోగా నటిస్తాడంటూ వార్తలొచ్చాయి. అయితే, పారితోషికం కారణంగా రవితేజ ఈ ప్రాజక్టు నుంచి తప్పుకున్నాడని ప్రచారం జరుగుతోంది. దాంతో అనూహ్యంగా ఈ ప్రాజక్టులోకి గోపీచంద్ వచ్చాడు.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ తో పాటు, ఫస్ట్ లుక్ ని త్వరలోనే రిలీజ్ చేస్తామని మారుతి చెప్పారు. మారుతి దర్శకత్వంలో పనిచేయడానికి ఎగ్జయిట్ అవుతున్నానని హీరో గోపీచంద్ చెప్పాడు.