20 ఎకరాల్లో వేసిన ఈ సెట్ అత్యద్భుతం: చిరంజీవి

06-01-2021 Wed 17:04
  • ఆచార్య సినిమా కోసం  20 ఎకరాల్లో టెంపుల్ టౌన్ సెట్
  • గాలి గోపురం సెట్ ఆశ్చర్యం గొలిపేలా ఉందన్న చిరు
  • కళా దర్శకత్వ ప్రతిభకు మచ్చుతునక అని ప్రశంస
Chiranjeevi compliments Acharya film set

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'ఆచార్య' శరవేగంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు కొరాటాల శివ ఈ చిత్రానికి  దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలోని కోకాపేటలో భారీ టెంపుల్ టౌన్ సెట్ వేశారు. భారత సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 20 ఎకరాల్లో ఈ సెట్ వేశారు. దీనికి సంబంధించిన వీడియోను చిరంజీవి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ఈ వీడియోతో పాటు, దానికి సంబంధించిన వివరాలను చిరు తన అభిమానుల కోసం వివరించారు.

'ఆచార్య సినిమా కోసం ఇండియాలోనే అతి పెద్ద టెంపుల్ టౌన్ సెట్. 20 ఎకరాల విస్తీర్ణంలో వేయడం జరిగింది. అందులో భాగంగా గాలి గోపురం... ఆశ్చర్యం గొలిపేలా ప్రతి దాన్ని అద్భుతంగా మలిచారు. ఇది కళా దర్శకత్వ ప్రతిభకే ఒక మచ్చుతునక. నాకెంతో ముచ్చట అనిపించి, నా కెమెరాలో బంధించి మీతో పంచుకోవాలనుకున్నాను. నిజంగానే ఓ టెంపుల్ టౌన్ లో ఉన్నామా అనే విధంగా ఈ సెట్ ను రూపొందించిన కళా దర్శకులు సురేశ్ ని, ఈ టెంపుల్ టౌన్ ను విజువలైజ్ చేసిన డైరెక్టర్ కొరటాల శివని, దీన్ని ఇంత అపురూపంగా నిర్మించడానికి అవసరమైన వనరులను ఇచ్చిన నిర్మాతలు నిరంజన్ రెడ్డి, రాంచరణ్ లను నేను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ప్రేక్షకులకు కూడా ఈ టెంపుల్ టౌన్ ఒక ఆనందానుభూతిని కలిగిస్తుందనడంలో సందేహం లేదు' అని చిరంజీవి అన్నారు.