Jagan: అవుకులో చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం జగన్ ఆత్మీయ పరామర్శ

  • కరోనాతో మృతి చెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి
  • అవుకు వెళ్లిన సీఎం జగన్
  • చల్లా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన సీఎం
  • సీఎం వెంట మంత్రులు, నేతలు
CM Jagan visit Avuku and talked to Challa Ramakrishna Reddy family members

ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి ఇటీవలే కరోనా మహమ్మారికి బలైన సంగతి తెలిసిందే. హైదరాబాదులోని అపోలో అసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులను ఏపీ సీఎం జగన్ పరామర్శించారు. ఇవాళ ఆయన కర్నూలు జిల్లా అవుకు వెళ్లారు. ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి ఓర్వకల్లు వెళ్లిన సీఎం అక్కడ్నించి హెలికాప్టర్ లో అవుకు చేరుకున్నారు. చల్లా రామకృష్ణారెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించి, ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా చల్లా రామకృష్ణారెడ్డి తనయుడు భగీరథ రెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా, జగన్ వస్తున్నారని తెలియడంతో చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులే కాకుండా, ఆయన సోదరులు కూడా విచ్చేశారు. చల్లా కుమారుడు భగీరథ రెడ్డి, సోదరులు చల్లా రఘునాథ్ రెడ్డి, చల్లా ప్రభాకర్ రెడ్డి, చల్లా రామేశ్వర్ రెడ్డి, అల్లుళ్లు, కుమార్తెలు, మనవలు ఇలా పాతికమంది వరకు వచ్చారు. వారందరితోనూ సీఎం జగన్ ఆత్మీయంగా మాట్లాడి వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.

సీఎం జగన్ వెంట ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కర్నూలు జిల్లా ఇన్చార్జి మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తదితరులున్నారు.

More Telugu News