AP DGP: 'ఇగ్నైట్' లో పోలీసు తండ్రీకూతుళ్లను అభినందించిన డీజీపీ గౌతమ్ సవాంగ్

DGP Gautam Swang met Police father and daughter
  • తిరుపతిలో పోలీస్ డ్యూటీ మీట్
  • అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న శ్యాంసుందర్, జెస్సీ
  • సీఐగా పనిచేస్తున్న శ్యాంసుందర్
  • డీఎస్పీ విధుల్లో ఉన్న జెస్సీ
  • ఇద్దరితో ప్రత్యేకంగా మాట్లాడిన డీజీపీ
గత కొన్నిరోజులుగా మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ పోలీసు తండ్రీకూతుళ్లు శ్యాంసుందర్, జెస్సీ ప్రశాంతి దర్శనమిస్తున్నారు. తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్ లో డీఎస్పీ హోదాలో ఉన్న తన కుమార్తె జెస్సీ ప్రశాంతికి సీఐ ర్యాంకులో ఉన్న తండ్రి శ్యాంసుందర్ సెల్యూట్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. అక్కడ్నించి మొదలు... వీరిద్దరి గురించి అందరిలోనూ ఆసక్తి మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి వంటి సెలబ్రిటీలు కూడా శ్యాంసుందర్, జెస్సీల గురించి ప్రస్తావించారు.

తాజాగా, ఇగ్నైట్ పేరిట తిరుపతిలో జరుగుతున్న పోలీస్ మీట్ లో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్... ఈ తండ్రీకూతుళ్లతో ప్రత్యేకంగా మాట్లాడారు. వారి గురించి వివరాలు తెలుసుకుని మనస్ఫూర్తిగా అభినందించారు. కుమార్తెను పోలీసు అధికారిణిగా మలిచిన సీఐ శ్యాంసుందర్ ను ప్రశంసించారు. వృత్తిలో మరింత ఎదగాలంటూ జెస్సీ ప్రశాంతిని దీవించారు.

కాగా, శ్యాంసుందర్ తిరుపతి కల్యాణి డ్యాం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో సీఐగా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె జెస్సీ ప్రశాంతి గుంటూరు అర్బన్ (సౌత్) డీఎస్పీగా వ్యవహరిస్తున్నారు. వీరి స్వస్థలం నెల్లూరు జిల్లా టీపీ గూడూరు మండలం పాపిరెడ్డిపాళ్యం. అయితే శ్యాంసుందర్ కుటుంబంతో సహా తిరుపతిలో స్థిరపడ్డారు. జెస్సీ ప్రశాంతికి ఒక చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. జెస్సీ ఎస్వీ యూనివర్సిటీ నుంచి ఎంబీఏలో గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఆమె తాత పేరం వెంకయ్య ఐపీఎస్ అధికారి. అయితే ఐఏఎస్ కావాలనుకున్న జెస్సీ తొలి ప్రయత్నంలో విఫలమయ్యారు. ఆ తర్వాత గ్రూప్స్ రాసి డీఎస్పీగా విధుల్లో చేరారు.
AP DGP
Gautam Sawang
Shyam Sundar
Jessy Prashanti
Ignite
Police Duty Meet
Tirupati

More Telugu News