15 నెలల చిన్నారి గుండె ఆపరేషన్ కు.. రూ. 4.50 లక్షల ఆసుపత్రి బిల్లు చెల్లించిన సోనూసూద్!

06-01-2021 Wed 08:38
  • జన విజ్ఞాన వేదిక ప్రతినిధుల ద్వారా సోనూ సూద్‌కు విన్నపం
  • ముంబై ఆసుపత్రిలో చిన్నారికి ఆపరేషన్
  • బిడ్డ ప్రాణాలు కాపాడిన సోనూకు తల్లిదండ్రుల కృతజ్ఞతలు
Sonu sood once again donate lakhs of rupees for baby girl operation

దాతృత్వానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ మరోమారు తన మంచి మనసు చాటుకున్నాడు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 15 నెలల వయసున్న చిన్నారి ఆపరేషన్‌కు అవసరమైన రూ. 4.50 లక్షల ఆసుపత్రి బిల్లు చెల్లించాడు.

కృష్ణా జిల్లా తిరువూరు మండలంలోని మునుకుళ్లకు చెందిన కొంగల వెంకటేశ్వర్లు, సరస్వతి దంపతుల కుమార్తె వర్షిత గుండె సంబంధిత సమస్యతో బాధపడుతోంది. పాపను బతికించుకోవాలంటే ఆపరేషన్ చేయాల్సిందేనని వైద్యులు చెప్పారు. పేద కుటుంబం కావడంతో ఆపరేషన్‌కు అవసరమైన డబ్బులు సమకూర్చుకోవడం వారికి తలకుమించిన భారంగా మారింది. దీంతో జనవిజ్ఞాన వేదిక ప్రతినిధుల ద్వారా చిన్నారి పరిస్థితిని నటుడు సోనూ సూద్ దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే స్పందించిన ఆయన ముంబై ఆసుపత్రిలో చిన్నారి ఆపరేషన్‌కు అవసరమైన రూ. 4.50 లక్షల సాయం అందించాడు. చికిత్స అనంతరం చిన్నారి కోలుకోవడంతో వెంకటేశ్వర్లు దంపతులు సోమవారం స్వగ్రామానికి చేరుకున్నారు. తమ కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టారంటూ ఈ సందర్భంగా సోనూ సూద్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.