KCR: కేసీఆర్ సమీప బంధువు ప్రవీణ్‌రావు, ఆయన సోదరుల కిడ్నాప్.. పోలీసుల వేట.. కిడ్నాప్ కథ సుఖాంతం!
- గత రాత్రి ఏడున్నర సమయంలో కిడ్నాప్
- ఐటీ అధికారులమంటూ ఇంట్లోకి చొరబడి బలవంతంగా తీసుకెళ్లిన దుండగులు
- దుండగులు ఉపయోగించిన వాహనాలను గుర్తించిన పోలీసులు
- మీడియా, పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన ప్రవీణ్ రావు సోదరుడు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీప బంధువైన హాకీ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు (51) , ఆయన ఇద్దరు సోదరుల కిడ్నాప్ కథ సుఖాంతమైంది. వారు సురక్షితంగా ఉన్నట్టు వారి మరో సోదరుడు ప్రతాప్ కుమార్ తెలిపారు. కిడ్నాప్‌నకు గురైన ముగ్గురినీ పోలీసులు వికారాబాద్‌లో గుర్తించారు.
ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ సోదరుడు చంద్రహాస్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. హాఫీజ్‌పేటలోని 100 కోట్ల రూపాయల విలువైన భూమి కోసం కొంతకాలంగా గొడవ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ కిడ్నాప్ జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
నిన్న సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో సికింద్రాబాద్, బోయిన్‌పల్లిలోని మనోవికాస్ నగర్‌లో ఉండే ప్రవీణ్‌రావు, ఆయన సోదరులు సునీల్‌రావు (49), నవీన్‌రావు (47) ఇంటికి వెళ్లిన దుండగులు తాము ఐటీ అధికారులమంటూ లోపలికి దూసుకెళ్లారు. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం ల్యాప్‌టాప్, ఫోన్‌తోపాటు వారి ముగ్గురినీ బలవంతంగా తమతో తీసుకెళ్లారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న నార్త్ జోన్ డీసీపీ కల్మేశ్వర్, సెంట్రల్ జోన్ డీసీపీ ప్రవీణ్‌రావు ఇంటికి చేరుకుని పరిశీలించారు. డైమండ్ పాయింట్, రాణిగంజ్ మీదుగా రెండు అనుమానిత వాహనాలు వెళ్లినట్టు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఇది కిడ్నాపేనని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. ప్రవీణ్‌రావు ఇంటి చుట్టూ గట్టి భద్రత ఏర్పాటు చేశారు. విషయం తెలిసిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ కవిత అక్కడకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తన సోదరులు క్షేమంగా ఇంటికి చేరుకున్నట్టు ప్రవీణ్‌రావు సోదరుడు ప్రతాప్ కుమార్ తెలిపారు. పోలీసులు, మీడియాకి ధన్యవాదాలు తెలియజేశారు. కిడ్నాప్‌నకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడిస్తారని పేర్కొన్నారు.