కమలహాసన్ వ్యాఖ్యలను తప్పుపట్టిన కంగన రనౌత్

05-01-2021 Tue 19:48
  • ఇంటి పనిని కూడా వేతన వృత్తిగా గుర్తిస్తామన్న కమల్
  • ప్రతి విషయాన్ని వ్యాపారంగా చూడొద్దన్న కంగన
  • ఇంటి యజమాని అయిన మహిళను ఉద్యోగిగా మార్చొద్దు
Kangana Ranaut opposes Kamal Hassans comments on woman

ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ పూర్తి స్థాయిలో రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారపర్వంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో ఇటీవల కమల్ మాట్లాడుతూ, తాము అధికారంలోకి వస్తే ఇంటి పనిని కూడా వేతన వృత్తిగా గుర్తిస్తామని అన్నారు. కమల్ ఆలోచనను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా ప్రశంసించారు. అయితే, ఈ వ్యాఖ్యలను బాలీవుడ్ నటి కంగన రనౌత్ తప్పు పట్టారు.

ఇంట్లో మహిళ చేసే పనికి విలువ కట్టొద్దని కంగన అన్నారు. మాతృత్వానికి, అమితంగా ప్రేమించే వ్యక్తులతో శృంగారానికి వెల కట్టొద్దని చెప్పారు. ప్రతి విషయాన్ని వ్యాపారంగా చూడొద్దని తెలిపారు. మహిళలకు కావాల్సింది వేతనం మాత్రమే కాదని... ప్రేమ, గౌరవం కూడా అని అన్నారు. ఇంటి యజమాని అయిన మహిళను ఉద్యోగిగా మార్చొద్దని చెప్పారు. భగవంతుడి సృష్టికి డబ్బులు చెల్లించాలని భావించొద్దని సూచించారు.