Kethireddy Peddareddy: తాడిపత్రి ఘటనపై సీఎం జగన్ ను కలిసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
- ఇటీవల తాడిపత్రిలో కేతిరెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి
- స్పందించిన సీఎం జగన్ కార్యాలయం
- సీఎంతో భేటీ అవ్వాలంటూ కేతిరెడ్డికి సమాచారం
- సీఎంను కలిసి వివరణ ఇచ్చిన కేతిరెడ్డి
- ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదన్న సీఎం!
తాడిపత్రి శాసనసభ్యుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇవాళ సీఎం జగన్ ను కలిశారు. ఇటీవల తాడిపత్రిలో జరిగిన పరిణామాలను వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సీఎంకు వివరించారు. సోషల్ మీడియా పోస్టులు, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో వివాదం, తదనంతర పరిణామాలను ఆయన సీఎంకు తెలిపారు. కాగా, ఈ భేటీలో ఎమ్మెల్యే కేతిరెడ్డితో పాటు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్యే వివరణ విన్న అనంతరం, మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ స్పష్టం చేసినట్టు సమాచారం.
అంతకుముందు, తాడిపత్రిలో జరిగిన ఘర్షణలపై సీఎం జగన్ కార్యాలయం ఆరా తీసింది. ముఖ్యమంత్రిని కలవాలంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డికి సీఎంవో నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఇటీవల కాలంలో వైసీపీ నేతలకు సంబంధించిన వ్యవహారాలు, వివాదాలపై సీఎం ఫోన్ లో కాకుండా వ్యక్తిగతంగా పిలిపించుకుని వివరణ కోరుతున్నట్టు తెలుస్తోంది.