ప్రభాస్ అభిమానులకు 'రాధే శ్యామ్' దర్శకుడి ప్రామిస్

05-01-2021 Tue 12:37
  • టాలీవుడ్ భారీ చిత్రాలలో 'రాధే శ్యామ్' ఒకటి 
  • టీజర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు
  • త్వరలోనే వస్తుందంటున్న దర్శకుడు రాధాకృష్ణ
Director of Radhe Shyam promises Prabhas fans

ఇప్పుడు టాలీవుడ్ లో నిర్మాణంలో వున్న భారీ సినిమాలలో 'రాధే శ్యామ్' ఒకటి! అత్యధిక బడ్జెట్టుతో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పుడు అందరి దృష్టీ వుంది. 'సాహో' తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రం పట్ల బాలీవుడ్ కూడా ఓ కన్నేసి ఉంచింది. ఇక ఇక్కడ మన ప్రభాస్ అభిమానులైతే చెప్పేక్కర్లేదు. ఈ సినిమా గురించి ఏ వార్త వచ్చినా ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫొటోలు, టీజర్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరో టీజర్ అప్ డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తాజాగా స్పందించాడు.

"టీజర్ గురించిన అప్ డేట్ అతి త్వరలోనే మీ ముందుంటుంది. అంతవరకూ కాస్త ఓపిక పట్టండి. మీ ఓపికకు న్యాయం చేకూర్చేలా ఆ టీజర్ ఉంటుందని మాత్రం ప్రామిస్ చేస్తున్నాను' అంటూ ఆయన ట్వీట్ చేశాడు. ప్రభాస్ సరసన పూజ హెగ్డే ఇందులో కథానాయికగా నటిస్తున్న సంగతి విదితమే. దీనికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతానని అందిస్తున్నాడు.