ఆరేళ్లలో 1,740 కోట్లు ఆర్జించిన బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్.. కరోనా కాలంలోనూ హవా!

05-01-2021 Tue 10:27
  • వివరాలు వెల్లడించిన ఫోర్బ్స్ మ్యాగజైన్
  • 2019లో ఆరు సినిమాలతోపాటు ప్రమోషన్ల ద్వారా రూ.459.22 కోట్ల సంపాదన
  • ఈ ఏడాది మళ్లీ ఫుల్ బిజీ
Bollywood Actor Akshay Kumar earns Rs 1740 crores in six years

బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ గత ఆరేళ్లలో ఏకంగా 1,740 కోట్లు ఆర్జించినట్టు అమెరికాకు చెందిన బిజినెస్ మ్యాగజైన్ ‘ఫోర్బ్స్’ వెల్లడించింది. కరోనాతో ఆర్థిక వ్యవస్థలు కుదేలైన గతేడాది కూడా రూ.356.57 కోట్లు సంపాదించినట్టు పేర్కొంది. అక్షయ్ కుమార్ 2019లో రూ.459.22 కోట్లు, 2018లో రూ.277.06 కోట్లు, 2016లో రూ. 208.42 కోట్లు సంపాదించినట్టు తెలిపింది.

2019లో అక్షయ్ ఫుల్ బిజీగా మారిపోయాడు. కేసరి, బ్లాంక్, మిషన్ మంగళ్, హౌస్‌ఫుల్ 4, గుడ్ న్యూజ్ వంటి సినిమాలతోపాటు పలు బ్రాండ్ల ప్రమోషన్ ద్వారా రూ.459.22 కోట్లు సంపాదించాడు. గతేడాది ‘లక్ష్మి’ సినిమా మాత్రమే చేశాడు. ఈ ఏడాది మళ్లీ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఏకంగా ఏడు సినిమాలకు సైన్ చేశాడు. బెల్ బాటం, సూర్యవంశీ, అత్రంగి రే, పృథ్వీ రాజ్, రక్షాబంధన్, రామ్ సేథు, బచ్చన్ పాండే సినిమాల్లో అక్షయ్ నటిస్తున్నాడు.