బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్న వాణీ విశ్వనాథ్, ప్రియారామన్!

05-01-2021 Tue 07:53
  • చెన్నైలో భేటీ అయిన బీజేపీ ఏపీ కార్యాలయ బాధ్యుడు సత్యమూర్తి
  • జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఇస్తామని హామీ
  • సోము వీర్రాజుతో చర్చించిన అనంతరం అధికారికంగా పార్టీలోకి
Actors Vani Viswanath and Priya Raman to join in BJP

దక్షిణాదిలో బలపడాలని చూస్తున్న బీజేపీ చరిష్మా ఉన్న నేతలు, సినీ నటులను పార్టీలోకి ఆహ్వానిస్తూ బలం పెంచుకుంటోంది. తమిళనాడులో ఎలాగైనా అడుగిడాలని చూస్తున్న కాషాయపార్టీ.. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇందులో భాగంగా చేరికలపై దృష్టిసారించింది.

 ప్రజాకర్షణ కలిగిన నేతలు, సినీ తారలను ఆహ్వానించడం ద్వారా పార్టీకి అదనపు ఆకర్షణ తీసుకురావాలని యోచిస్తోంది. నిన్న తమిళనాడు రాజధాని చెన్నైలో సీనియర్ మహిళా నటులు వాణీవిశ్వనాథ్, ప్రియారామన్‌‌లతో వేర్వేరుగా భేటీ అయిన బీజేపీ ఏపీ కార్యాలయ బాధ్యుడు సత్యమూర్తి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు కల్పిస్తామని వారికి హామీ ఇచ్చారు. పార్టీ బలోపేతానికి సహకరిస్తే 2024 ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని, అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో జరగనున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనాలని కోరారు. ఇందుకు వారు ఓకే అన్నట్టు  సమాచారం. బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజుతో చర్చించిన అనంతరం వాణీ విశ్వనాథ్, ప్రియారామన్‌లు అధికారికంగా బీజేపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.