Woman: భర్తను చంపిన ఇల్లాలు...  ఫేస్ బుక్ లో పోస్టు చూసి ఫిర్యాదు చేసిన పొరుగువారు

Woman kills her husband and posted it on Facebook

  • ఢిల్లీలో దారుణం
  • భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య
  • భర్తను చంపిన విషయం ఫేస్ బుక్ లో వెల్లడి
  • ఆపై ఆత్మహత్యకు యత్నించిన వైనం

ఢిల్లీలో ఘాతుకం జరిగింది. ఓ మహిళ తన భర్తను చంపడమే కాకుండా, ఆ విషయాన్ని ఫేస్ బుక్ లో పోస్టు చేసిన వైనం నివ్వెరపరుస్తోంది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిన్ ప్రాంతానికి చెందిన దంపతులు 2013 నుంచి ఢిల్లీలో నివసిస్తున్నారు. వారిద్దరూ బీమా సంస్థల్లో ఉద్యోగులు. ఢిల్లీలోని చతార్ పూర్ ప్రాంతంలో ఉంటున్న వారికి పిల్లలు కలగలేదు. వీరిద్దరి మధ్య కొన్నాళ్లుగా కలతలు నడుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో, వారి పొరుగింటి వాళ్లు ఫేస్ బుక్ లో ఓ పోస్టు చూసి హడలిపోయారు. తాను భర్తను హత్య చేసినట్టు ఆ మహిళ ఫేస్ బుక్ ద్వారా వెల్లడించింది. ఈ విషయాన్ని పొరుగింటి వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు వచ్చి అపార్ట్ మెంట్ తలుపులు బలవంతంగా తెరిచి చూడగా భయానక దృశ్యాలు కనిపించాయి.

భర్త రక్తపు మడుగులో పడి ఉండగా, భార్య స్పృహకోల్పోయిన స్థితిలో దర్శనమిచ్చింది. ఆ గదిలో నేలపై రక్తం మడుగు కట్టి ఉంది. అంతేకాదు, గోడలపై రక్తం చల్లి ఉండడాన్ని గమనించారు. భర్తను కత్తితో పొడిచి చంపిన తర్వాత భార్య ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు పోలీసులు తెలుసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఆ మహిళను చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

Woman
Murder
Husband
Facebook
New Delhi
  • Loading...

More Telugu News