New Year: రోహిత్ శర్మ సహా ఐదుగురికీ కరోనా నెగటివ్: బీసీసీఐ
- న్యూ ఇయర్ సందర్భంగా రెస్టారెంట్‌కు వెళ్లిన భారత ఆటగాళ్లు
- బయోబబుల్‌ను ఉల్లంఘించారంటూ ఐసోలేషన్‌కు తరలింపు
- తాజా పరీక్షల్లో ఆటగాళ్లు సహా జట్టు సహాయక సిబ్బందికి నెగటివ్
ఐసోలేషన్‌లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు రోహిత్‌శర్మ, శుభ్‌మన్ గిల్, నవ్‌దీప్ సైనీ, రిషభ్ పంత్, పృథ్వీషాలకు నిర్వహించిన కరోనా టెస్టులో నెగటివ్ రిపోర్టులు వచ్చినట్టు బీసీసీఐ తెలిపింది. న్యూ ఇయర్ సందర్భంగా ఇటీవల వీరంతా మెల్‌బోర్న్‌లోని ఓ భారతీయ రెస్టారెంటుకు వెళ్లారు. అక్కడ తమ బిల్లును కట్టిన అభిమానిని రిషభ్ పంత్ కౌగిలించుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన క్రికెట్ ఆస్ట్రేలియా ఈ ఐదుగురు ఆటగాళ్లను ఐసోలేషన్‌కు పంపింది. అంతేకాక, బయోబబుల్ నిబంధనలు ఉల్లంఘించినట్టు ఆరోపణలు రావడంతో బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియాలు సంయుక్త దర్యాప్తు ప్రారంభించాయి.
ఐసోలేషన్‌లో ఉన్న ఈ ఐదుగురు ఆటగాళ్లకు తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్ రిపోర్టులు వచ్చినట్టు బీసీసీఐ పేర్కొంది. జట్టు సహాయక సిబ్బందికి కూడా కరోనా నెగటివ్ అనే రిపోర్టులు వచ్చినట్టు వివరించింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ నెల 7 నుంచి సిడ్నీలో మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు రెండు మ్యాచుల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో గెలిచి సమ ఉజ్జీలుగా ఉన్నాయి.