CAG: ఏపీపై రూ.3.73 లక్షల కోట్ల రుణభారం: కాగ్ వెల్లడి
- గతేడాది నవంబరు నాటికే పతాకస్థాయికి రుణభారం
- ఏప్రిల్-నవంబరు మధ్యలో రూ.73,811 కోట్ల అప్పు
- నవంబరు మాసంలోనే రూ.13 వేల కోట్ల రుణం
- రుణభారం మరింత పెరిగే అవకాశం ఉందన్న కాగ్
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా నివేదికలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై రూ.3.73 లక్షల కోట్ల అప్పుల భారం ఉన్నట్టు కాగ్ వెల్లడించింది. గతేడాది నవంబరు నాటికే రూ.3.73,140 కోట్లకు చేరిందని వివరించింది. గతేడాది ఏప్రిల్-నవంబరు మధ్య రూ.73,811 కోట్లు అప్పు చేశారని కాగ్ తెలిపింది. ఒక్క నవంబరు మాసంలోనే రూ.13 వేల కోట్ల రుణం తీసుకున్నట్టు వెల్లడైందని వివరించింది.
2020-21 సీజన్ లో పరిశీలిస్తే ఏపీ సర్కారు నెలకు సగటున రూ.9,226 కోట్ల మేర అప్పు చేసినట్టు కాగ్ పేర్కొంది. ఇదే ఒరవడి కొనసాగితే మాత్రం 2021 మార్చి నాటికి ఏపీ ప్రభుత్వం మరో రూ.30 వేల కోట్లు అప్పు చేయొచ్చని వెల్లడించింది. అదే జరిగితే ఈ 2020-21 సీజన్ లో ఏపీ అప్పుల భారం రూ.1.04 లక్షల కోట్లకు చేరుతుందని వివరించింది.
2014లో రాష్ట్ర విభజన సమయానికి ఏపీ అప్పుల విలువ రూ.97,000 కోట్లు కాగా, 2019 మార్చి నాటికి అది రూ.2,58,928 కోట్లకు పెరిగింది. ఆ తర్వాత కూడా అప్పులు పరంపర కొనసాగింది. 2019 ఏప్రిల్ నుంచి 2020 నవంబరు వరకు రూ.1,14,212 కోట్లను రుణాల రూపేణా వివిధ బ్యాంకులు, ఇతర మార్గాల్లోనూ స్వీకరించారు.