UFO: వాతావరణ బెలూన్ ను యూఎఫ్ఓగా భావించి రైతు పొలాన్ని నాశనం చేశారు!
- మధ్యప్రదేశ్ లో ఘటన
- పంట పొలంలో పడిపోయిన బెలూన్
- హడలిపోయిన వృద్ధరైతు
- యూఎఫ్ఓ కాదని తేల్చిన పోలీసులు
- పొలాన్ని కసాబిసా తొక్కేసిన గ్రామస్తులు
వాతావరణ పరిశోధనల నిమిత్తం శాస్త్రవేత్తలు తరచుగా సాంకేతిక పరికరాలతో కూడిన బెలూన్లను ప్రయోగిస్తుంటారు. ఇవి గ్రామీణ ప్రాంతాల వారికి విచిత్రంగా కనిపిస్తుంటాయి. తాజాగా, మధ్యప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ ప్రాంతంలో ఉన్న ఖేరాకసర్ గ్రామస్తులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఓ చిన్న యంత్ర పరికరంతో కూడిన బెలూన్ ఒకటి ఓ రైతు పొలంలో పడిపోయింది. దాన్ని చూసిన ఆ వృద్ధ రైతు హడలిపోయాడు.
ఆకాశం నుంచి ఊడిపడిన గుర్తు తెలియని వస్తువు (యూఎఫ్ఓ-అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్)గా భావించాడు. ఈ విషయం గ్రామం మొత్తం పాకిపోవడంతో ఊరు ఊరంతా ఆ రైతు పొలానికి చేరుకున్నారు. ఆ పొలంలో పంట వేసి ఉన్నప్పటికీ అదేమీ పట్టించుకోకుండా, పంటను తొక్కుకుంటూనే ఆ గుర్తు తెలియని వస్తువును ఆసక్తిగా పరిశీలించారు. చివరికి అది వాతావరణ పరిశోధకులు ప్రయోగించిన బెలూన్ అని తెలియడంతో అందరూ వెనుదిరిగారు.
కొందరు దాన్ని యూఎఫ్ఓగా భావించగా, మరికొందరు బాంబు అయ్యుంటుందని భయపడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేసి అది వాతావరణ బెలూన్ అని తేల్చారు. కానీ, గ్రామస్తుల తాకిడితో తన పంట మొత్తం నాశనం అయిపోయిందని ఆ ముసలి రైతు లబోదిబోమంటున్నాడు.