Shankar Mahadevan: బాలు నడక, మాట చూస్తే అచ్చం మా నాన్నను చూసినట్టే ఉంటుంది: శంకర్ మహాదేవన్

  • బాలు గురించి ఇంటర్వ్యూలో ప్రస్తావించిన శంకర్ మహాదేవన్
  • తమది తండ్రీకొడుకుల అనుబంధం అని వెల్లడి
  • తన సంగీతాన్ని ఎంతో ప్రశంసించేవారని వ్యాఖ్యలు
  • ఆయన సంగీతంలో జీవించే ఉంటారని ఉద్ఘాటన
Shankar Mahadevan recollects memories about SP Balasubrahmanyam

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇటీవల ఈ లోకాన్ని విడిచివెళ్లడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ గాయకుడు శంకర్ మహాదేవన్ ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలు గురించి ప్రస్తావించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో తనకు అపూర్వమైన అనుబంధం ఉందని వెల్లడించారు. ఆయన నడక, మాట చూస్తే అచ్చం మా నాన్నను చూసినట్టే ఉంటుంది అని శంకర్ మహాదేవన్ తెలిపారు. అదే మాట బాలుతో చెప్పానని గుర్తుచేసుకున్నారు.

"బాలు సర్... మీరు మాట్లాడుతున్నా, మీరు నడుస్తున్నా, మీరు పాడుతున్నా మా నాన్నలానే అనిపిస్తున్నారని చెప్పాను. మీలో మా నాన్నను చూసుకుంటున్నానని తెలిపాను. దాంతో బాలు ఏమన్నారో తెలుసా... ఇవాళ నుంచి నాకు మరో కొడుకు వచ్చాడు, అతని పేరు శంకర్ మహాదేవన్ అని ఎంతో వాత్సల్యపూరితంగా చెప్పారు. మా మధ్య ఆ విధమైన సంబంధం ఉండేది. అంతెందుకు, ఆయన చనిపోకముందు కొద్దిరోజుల కిందట... ఇద్దరం ఓ సినిమాలో పాడాం. ఆయన తండ్రి పాత్రకు పాడితే, నేను కొడుకు పాత్రకు పాడాను. అక్కడ కూడా మా అనుబంధం కొనసాగింది. ఆయనెప్పుడూ నాలోని సంగీత కళను ప్రశంసించేవారు. బాలు భౌతికంగా లేకపోయినా సంగీతంలో జీవించే ఉన్నారు" అని వివరించారు.

More Telugu News