Botsa Satyanarayana: రామతీర్థంలో మంత్రులకు నిరసన సెగ... డౌన్ డౌన్ అన్నంత మాత్రాన మేం డౌన్ అయిపోతామా? అంటూ బొత్స వ్యాఖ్యలు

Botsa and Vellampalli visit Ramatheertham shrine
  • రామతీర్థంలో మంత్రుల పర్యటన
  • హిందూ ధార్మిక సంఘాల నిరసన
  • డౌన్ డౌన్ అంటూ నినాదాలు
  • బీజేపీపై ఉన్న సదభిప్రాయం ఇప్పుడు పోయిందన్న బొత్స
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రామతీర్థం క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారికి నిరసన సెగ తగిలింది. హిందూ ధార్మిక సంఘాలకు చెందిన కార్యకర్తలు అడుగడుగునా వెల్లంపల్లి, బొత్సలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీనిపై మంత్రి బొత్స ప్రెస్ మీట్ లో స్పందిస్తూ, వాళ్లు డౌన్ డౌన్ అన్నంత మాత్రాన మేం డౌన్ అయిపోతామా? అంటూ వ్యాఖ్యానించారు.

ఒకప్పుడు బీజేపీ అంటే సదభిప్రాయం ఉండేదని, ఇప్పుడది పోయిందని అన్నారు. మేం వస్తుంటే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు... కొందరు అసభ్యకరంగా కూడా మాట్లాడారు అని బొత్స వెల్లడించారు. రామతీర్థం ఘటనపై తాము ఎంతో బాధపడుతున్నామని తెలిపారు. రాముడి విగ్రహాన్ని ఇలా చేయించినవాడు అసలు మనిషేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరం చేసింది ఎవరైనా సరే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు.  

చంద్రబాబు నిన్న రామతీర్థం రావడంపై స్పందిస్తూ, చంద్రబాబు వస్తే ఏంటి, పోతే ఏంటి అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో ఆలయాల విధ్వంసం జరిగితే అప్పుడెందుకు మాట్లాడలేదని బొత్స ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూస్తుందని, హిందూ మత పరిరక్షణే బాధ్యతగా పనిచేస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా బొత్స ఓ మీడియా ప్రతినిధిపై మండిపడ్డారు. సంఘటన గురించి తెలిసిన వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు అధికారులందరినీ అప్రమత్తం చేశానని వెల్లడించారు. కానీ మాజీ శాసనసభ్యులు ఎవ్వరూ ఈ ఘటనపై స్పందించలేదని, గత ఐదురోజులుగా వారు ఎక్కడికెళ్లారని మీడియా ఎందుకు నిలదీయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Botsa Satyanarayana
Vellampalli Srinivasa Rao
Ramatheertham
Chandrababu
BJP
Andhra Pradesh

More Telugu News